అలాగైతే రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన: కొడాలి నాని
రాజధాని వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కేంద్రంగా రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. గవర్నర్ నిర్ణయంతో వైసీపీ ప్రభుత్వం చకచకా రాజధాని తరలింపు ప్రక్రియకు ప్రణాళికలు వేస్తోంటే మరోవైపు వైసీపీ, తేదేపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గవర్నర్ నిర్ణయం వెలువడిన వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ నిర్ణయంతో యావత్తు ఆంధ్రప్రదేశ్ షాక్‌కు గురైందని అన్నారు. అమరావతి రాష్ట్రం మొత్తం కోరుకున్న రాజధానిగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ నేతలు శనివారం ఆయనపై ఎదురుదాడికి దిగారు.
తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు చెప్తున్నట్టుగా ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ అభీష్టం అనడంపై మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. అదే నిజమైతే, చంద్రబాబు తన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. అమరావతి రాజధాని అంశంపై ఉపఎన్నికలకు సిద్ధపడాలన్నారు. ఒకవేళ చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలు అన్ని సీట్లలో విజయం సాధిస్తే అప్పుడు చంద్రబాబు మాటలకు విలువ వస్తుందన్నారు. అంతేకాకుండా రాజధాని వికేంద్రీకరణ అంశంపై తమ ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం కూడా ఉంటుందన్నారు. బాబుకు దమ్మూ ధైర్యం ఉంటే ఈ సవాల్‌కి సిద్ధపడాలంటూ కొడాలి నాని తన సహజశైలిలో డిమాండ్ చేశారు.













