విశాఖ నుంచే పరిపాలన
ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న విశాఖ, ఇప్పుడు మహానగరం అయిందని, విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ అమరావతిలో అసెంబ్లీ కొనసాగుతుందని అన్నారు. సాగునీరు లేని జిల్లా విశాఖ అని, యూనివర్సిటీ లేని జిల్లా విజయనగరమని అన్నారు. విశాఖకు మావోయిస్టు ప్రభావం ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ సమీపంలోనే నాటి మంత్రి మాధవరెడ్డిని హత్య చేయలేదా? అంతమాత్రాన హైదరాబాద్ నుంచి రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారు. రాజధాని దూరం అనేది పెద్ద విషయం కాదని అన్నారు. ఇంతకు ముందు రాజధానిగా ఉన్న హైదరాబాద్కు శ్రీకాకుళం నుంచి వెళ్లలేదా? అని ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లడంలేదా? అని అన్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరి, తాడేపల్లిలో టీడీపీ ఓడిపోయిందని, అది రెఫరెండం కాదా అని ప్రశ్నించారు.













