2018 డిసెంబర్ నాటికి ఎయిమ్స్ మొదటి దశ పూర్తి
మంగళగిరి పట్టణ శివారులో జరుగుతున్న ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్) నిర్మాణ పనుల మొదటి దశ 2018 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మంగళగిరి పట్టణ శివారులోని పూర్వపు టీబీ శానిటోరియం ప్రాంగణం 193 ఎకరాల విస్తీర్ణంలో 1618 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ పనుల పురోగతిని బుధవారం జిల్లా కలెక్టర్ కోన శశిధర్, విద్యుత్, అటవీ శాఖ, ఆర్ అండ్ బి, నీటి సరఫరా విభాగం మొదలైన శాఖల అధికారులతో కలిసి మంత్రి కామినేని శ్రీనివాస్ సమీక్షించారు. ఎయిమ్స్ భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని శ్రీనివాస్ విలేఖర్లతో మాట్లాడారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎయిమ్స్ పనుల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఒకసారి సమీక్షించారని, జిల్లా కలెక్టర్ ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారని, అనుకున్న దానికంటే వేగంగా ఎయిమ్స్ నిర్మాణ పనులు జరుగుతుండటం సంతోషంగా ఉందని ఆయనన్నారు. మొదటి ఫేజ్లో ఓపి బ్లాక్, డాక్టర్ల నివాస గృహాలు నిర్మాణం జరుగుతుందని, 2019 మార్చి వరకు వీటి నిర్మాణానికి గడువున్నప్పటికీ 2018 డిసెంబర్ నాటికే మూడు నెలలు ముందుగా పనులు పూర్తవుతాయని కామినేని అన్నారు.













