నైపుణ్యం వల్లే యువతకు… ఉద్యోగాలు

నైపుణ్యం వల్లే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆంధప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి తెలిపారు. సమగ్ర పరిశ్రమ సర్వే, కౌన్సెలింగ్, స్కిల్లింగ్, ప్లేస్‍మెంట్స్, రీస్కిల్లింగ్‍లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రీస్కిల్లింగ్‍లో భాగంగా శిక్షకులకు శిక్షణ, అత్యాధునిక శిక్షణ వంటి అంశాలపై చర్చించారు. సమగ్ర పరిశ్రమ సర్వే గురించి ఆరా తీశారు. రెండు శాఖలను ఏకతాటిపైకి తీసుకువచ్చే అంశాలపై మంత్రి సంబంధిత అధికారులతో చర్చించారు. నైపుణ్య, పరిశ్రమల శాఖల్లోనే కాకుండా ఇతర శాఖల్లో స్కిల్లింగ్ పైనా వర్కౌట్ చేస్తామని నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మీడియాతో మాట్లాడుతూ వైఎస్‍ఆర్‍ఏపీ వన్ గొడుకు కిందకు అన్ని శాఖలు వస్తాయని చెప్పారు.
పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలకు నైపుణ్య శాఖ వారధిగా ఉంటుందన్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు అనే చట్టం అమలుపై అన్ని శాఖ సమన్వయం అవసరమన్నారు. ఈ విషయంపై నోడల్ అధికారిగా జిల్లా ఎంప్లాయ్‍మెంట్ అధికారి ఉంటారని తెలిపారు. పాలసీ తయారీ, పర్యవేక్షణలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పక్రియను పరిశీలించేందుకు, ఎప్పటికప్పుడు నివేదికలు అందించడానికి జిల్లా స్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.