పెట్టుబడులకు అనువైన ప్రాంతం ఎపినే…. మంత్రి గౌతం రెడ్డి
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్నీ సదుపాయాలు ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు కూడా 30 రోజుల్లోనే ఇచ్చే విధంగా పాలసీలను కూడా ప్రభుత్వం ప్రకటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, జౌళి, నైపుణ్యాభివ•ద్ధి, శిక్షణ పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని పెంచే ఐఐటీ, ఐఐఎమ్, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలు, 300కు పైగా నైపుణ్యాన్ని అందించే ఇంజనీరింగ్ కాలేజీలు, మరో 300 పాలిటెక్నిక్ కాలేజీలు, 500కు పైగా ఐటీఐ వంటి విద్యా సంస్థలతో పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం కలిగిన మానవవనరులను తీర్చిదిద్దే శక్తి ఆంధప్రదేశ్ రాష్ట్రానికే ప్రత్యేకమని చెప్పారు. దాంతోపాటు ఆంధప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని కూడా తీర్చిదిద్దుతోంది. పరిశ్రమలకు కావలసిన నైపుణ్యత సాధించే 30 ప్రత్యేక నైపుణ్య కాలేజీలను ఏర్పాటు చేస్తోంది.
అంతేకాకుండా, 2 పారిశ్రామిక కారిడార్లు, 40 వేల ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్, 6 పోర్టులు, మరో 6 ఎయిర్ పోర్టులు అందులో 3 అంతర్జాతీయ విమానాశ్రమాలు, ప్రతీ చోటికి ప్రయాణం చేయగలిగేలా రోడ్లు ఉన్న ఏపీ పరిశ్రమల ఏర్పాటుకు అనువైనది. పరిశ్రమలకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా, నీరు పుష్కలంగా ఉండడం, నెలకు 3.5 లక్షల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మొబైల్ తయారీ యూనిట్లు, జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలకు చెందిన పరిశ్రమలు, పరిశ్రమల ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా మిగతా ఏ రాష్ట్రంలోనూ లేనంత చౌకగా లభ్యమయ్యే ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలను ఆహ్వానిస్తున్నాము. పారదర్శక పారిశ్రామిక విధానాన్ని జూన్ 26వ తేదీన ఖరారు చేస్తున్నాం, పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు వచ్చేలా పాలసీ ప్రవేశ పెడుతున్నామని గౌతం రెడ్డి తెలిపారు.













