దుబాయ్ పారిశ్రామిక వేత్తలతో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాణిజ్యం, తయారీ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా మార్పు చెందడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో ఉన్నాయని రాష్ట్ర మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దుబాయ్ ఎక్స్‌పోలో భాగంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో మంత్రి భేటీ అయ్యారు. నెట్వర్కింగ్ డిన్నర్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజ వనరులకు ఆంధ్రప్రదేశ్ చిరునామా అని అన్నారు. అరుదైన ఖనిజ సంపద, పర్శిమల ఏర్పాటుకు ఎలాంటి అవాంతరాలు ఉండవు. సమర్థవంతమైన పాలన, మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరులు, పారిశ్రామిక, వాణిజ్య పరంగా సానుకులా వాతావరణం రాష్ట్రంలో ఉందన్నారు.
సులభతర వాణిజ్యంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించిందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పన, ఎయిర్ పోర్టు, లాజిస్టిక్ విభాగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు, నీరు తక్కువ ధరకే అందిస్తామని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వళవన్ పేర్కొన్నారు. ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో అల్లాన్ గ్రూప్ ఐబీపీసీ, ముఖ్ హోల్డింగ్స్, ఆల్ మయా గ్రూప్, డీపీ వరల్డ్, ఆల్ ఘర్ ఎయిర్ గ్రూప్, ఎన్ వెంట్, క్యూ, రెగల్ నియక్ గ్రూప్, ట్రేడర్స్, ఈఎస్పీఏ, టైస్టార్, ఏఐ దుబోవి గ్రూప్, సెల్ ఫోర్స్, ఎస్బీ వెంచర్స్, ఎన్ వెంకట్, భావన్ గ్రూప్, క్రిసెంట్ పెట్రోలియం కంపెనీల చైర్మన్లు, ఎండీలు పాల్గొన్నారు.













