కేంద్రాన్ని నిలదీసే ధైర్యం ఆయనకు లేదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్కళ్యాణ్్కు 25 ప్రశ్నలను సంధించారు. పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల్ని పవన్ కళ్యాణ్ కళ్లతో చూడలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని గెలిపించింది తానే అనే భ్రమలో ఆయనున్నారని ఆక్షేపించారు. బీజేపీ, వైసీపీని పవన్ ఎందుకు విమర్శించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చిన నిధుల లెక్కపై పవన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఇలా ప్రతి అంశంలోనూ తెలుగుదేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న పవన్, మోదీ, అమిత్ షాను ప్రశ్నించడానికి మాత్రం సాహసం చేయలేకపోతున్నారని విమర్శించారు. బీజేపీ మాటలనే పవన్ మాట్లాడుతున్నట్లు ఉందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన దస్త్రాలు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయని, వీటి గురించి మాట్లాడే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు. ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్‌తో పవన్ కుమ్మక్కయ్యారని అన్నారు. బీజేపీ, వైసీపీ స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారని విమర్శించారు.













