ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖలో ఎంసెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,90,922 మంది పరీక్ష రాయగా, 1,38,017 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 72.28గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గింది. 8,529 మంది ఎంసెట్లో ర్యాంక్ వచ్చి ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేదు. 1,26,197 మందికి ర్యాంకులు కేటాయించారు.
అలాగే అగ్రికల్చర్ విభాగంలో 73,373 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 63,883 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత శాతం 87.6 గా ఉంది. అగ్రికల్చర్ విభాగంలోనూ 2,668 మంది ఎంసెట్లో ర్యాంక్ వచ్చి ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేదు. 58,927 మందికి ర్యాంకులు కేటాయించారు. మొత్తం 137 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. మే 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, జూన్ 11 నుంచి క్లాసులు ప్రారంభంకానున్నాయి.













