ఆ భేటీ జరిగిన తర్వాతే డేటా చోరికి ప్లాన్
ప్రతిపక్ష నేత జగన్‌కి అధికార పిచ్చి పట్టిందని, అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ధ్వజమెత్తారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సహకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఓట్లను అక్రమంగా తొలగిస్తున్న కుట్రలపై ప్రజలు ఎక్కడికక్కడ వైసీపీని నిలదీస్తున్నారని తెలిపారు. లోటస్‌పాండ్‌లో కేటీఆర్, జగన్ భేటీ జరిగిన తర్వాతే డేటా చోరికి ప్లాన్ జరిగిందని, ఐటీ యాక్ట్‌ను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఫాం 7 దరఖాస్తులు తామే పెట్టామని జగన్ ఒప్పుకున్నారని, ఎన్నికల కమిషన్ జగన్‌పై వెంటనే చర్యలు తీసుకొని ఏ-1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
జగన్ నెల్లూరు సభలో మాట్లాడిన భాష అభ్యంతర కరంగా ఉందని ఆయన ఆక్షేపన తెలిపారు. ప్రభుత్వం ఖర్చు చేసే నిధులపై ప్రశ్నించే అధికారం ప్రతిపక్ష నేతగా ప్రజలు ఆ హక్కును ఇచ్చారనీ, కానీ ఆ కార్యక్రమాన్ని చేయడం లేదన్నారు. జగన్‌కి ఎలాంటి అజెండాల లేదని, అందుకే పసలేని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పదవి రాలేదని దుగ్ధతో జగన్ మాట్లాడుతున్నారని, సభ్య సమాజం హర్షించలేని భాషను వాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతనంగా ఏర్పడినా సరే పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజలో ఉందని, ఈ విషయాన్ని సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంకే ఈ నివేదికను ఇచ్చిందని అన్నారు.













