ఆ విషయం తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయింది : దేవినేని
విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఏపీకి కూడా అధికారం ఉందని, ఆ విషయం తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయినట్టుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌పై తెలంగాణకు ఎంత అధికారం ఉందో, ఏపీకి అంతే అధికారం ఉందన్నారు. కేసీఆర్ ముసుగు తొలగించి ముందుకురావాలని మంత్రి సవాల్ చేశారు. జగన్ గృహ ప్రవేశానికి వస్తానని ఉత్తరకుమారుని ప్రగల్భాలు పలికారని, అలాగే విశాఖ వస్తానని అన్నారని ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి ప్రచారం చేశారని, టీడీపీ జాతీయ పార్టీగా దేశంలో ఎక్కడైనా పోటీ చేస్తామని, ప్రచారం చేస్తామని అన్నారు.
కేసీఆర్ ఏపీలో ఎక్కడికి వస్తారో రావాలని సవాల్ చేశారు. ముసుగు తీసి నేరుగా వస్తే, ధైర్యంగా ప్రజలవద్దకు వెళదామని అన్నారు. ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగించే ప్రక్రియకు వైసీపీ శ్రీకారం చుట్టిందని, దీనిపై ఈసీ విచారణ జరిపి 45 కేసులు నమోదు చేసిందని, దీనికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డేటా సాయంతో ప్రతి ఒక్క పేదవానికి ప్రభుత్వ పథకాలు అందేలా టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.













