కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో మంత్రి బుగ్గన భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్‌రాక్ కంపెనీ ఐసీజేలో వేసిన కేసుపై కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలిపారు. అన్‌రాక్ సంస్థకు అవసరమైన బాక్సైట్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరామని, కేసు పరిష్కారమైతే రాష్ట్రానికి పెద్ద కంపెనీ వస్తుందని చెప్పారు. 2008లో అప్పటి సర్కారు ఆన్‌రాక్‌కు బాక్సైట్ సరఫరా చేయలేకపోయిందన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థల ఏర్పాటు గురించి కేంద్ర మంత్రితో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
ఐఐఎఫ్‌టీ, ఐఐపీ ఏర్పాటుకు రాష్ట్రం ఇప్పటికే స్థలం కేటాయించిందన్నారు. ఆంధప్రదేశ్ విద్య, నైపుణ్య శిక్షణ సంస్థలు ఎక్కవ ఉండాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం చేసే అప్పులపై టీడీపీ అనవసర రాద్ధాంతమని విమర్శించారు. అప్పులపై టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడేందుకు అప్పులు తెచ్చామని అన్నారు. తెలుగుదేశం హయాంలో కరోనా లేనప్పటికీ అప్పులు చేశారని అన్నారు. కారోనా కారణంగా పెరగాల్సిన ఆదాయం పడిపోయిందని, అందుకే ఈ పరిస్థితుల్లో అప్పులు చేయక తప్పడం లేదని తెలిపారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర విశ్వసనీయతను దెబ్బతీసేలా టీడీపీ ప్రవరిస్తోందని, ఆ పార్టీ ప్రవర్తన కారణంగా మొత్తం రాష్ట్రానికే నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.













