చంద్రబాబు తప్పు ఒప్పుకొని రాజకీయాలు వదిలిపెట్టాలి: మంత్రి బొత్స
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన తప్పు ఒప్పుకొని రాజకీయాలు వీడాలని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. అయినా కూడా టీడీపీ నేతలు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ అమాయకులని టీడీపీ అనుకుంటోందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పు వల్ల రాష్ట్రమంతా తలదించుకోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చంద్రబాబు నిజాయితీపరుడే అయితే కోర్టులో ఆ నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ అంశం కేబినెట్ తీసుకున్న నిర్ణయమే కానీ ప్రభుత్వ అధినేతగా చంద్రబాబుకు బాధ్యత ఉండదా? అని నిలదీశారు. ‘చేసిందేమో తప్పుడు పని, దొంగ పని. కానీ ఏదో పెద్దమనిషిలా, యుగపురుషుడిలా బిల్డప్ ఇస్తున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కూడా భారీగా అవినీతి జరిగింది. రాజధాని విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయి. తన హయాంలో అన్ని వ్యవస్థలను టీడీపీ అధినేత తన చేతుల్లోకి తీసుకొని ప్రజధనాన్ని అడ్డంగా దోచుకున్నారు’ అని బొత్స ధ్వజమెత్తారు.
ఇలా పలుకేసుల్లో అరెస్టయిన మొదటి మాజీ సీఎం చంద్రబాబు ఒక్కరే కాదని, ఉత్తర భారతదేశంలో సీఎంలుగా పనిచేసిన వాళ్లు, మాజీ కేంద్రమంత్రులు కూడా అరెస్టులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. వారందరి కంటే చంద్రబాబు పెద్ద గొప్పవాడా? అని ప్రశ్నించారు. ‘జగన్ పాలనలో తప్పులకు, అవినీతికి తావులేదు. ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే ఊరుకోవడం జరగదు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయినా అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాతే చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగింది’ అని బొత్స స్పష్టం చేశారు.













