నెల్లూరు అధికారులను అప్రమత్తం చేశాం : మంత్రి ఆళ్ల నాని
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాయడంపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆళ్లనాని స్పందించారు. నెల్లూరు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులను తాము అప్రమత్తం చేశామని వెల్లడించారు. కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు కలెక్టర్‌ను, జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిని తాము ఆదేశించామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 12 కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేశామని, అన్ని రకాల చర్యలూ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఐదుగురు మంత్రులతో కోవిడ్ నివారణకు కమిటీని కూడా వేశామని ఆళ్ల నాని వెల్లడించారు.
సీఎం జగన్ కు లేఖ రాసిన టీడీపీ నేత
నెల్లూరు జిల్లాలోనే ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పరిస్థితి చేయిదాటక మునుపే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్‌కు సోమిరెడ్డి లేఖ రాశారు. జీజీహెచ్‌లో ఉన్న అని బెడ్లపై వైద్య సేవలు అందించాలని, ఖాళీగా ఉన్న వెంటిలేటర్లను తాత్కాలికంగా ప్రైవేట్ ఆస్పత్రులకు పంపాలని సోమిరెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.













