రాజకీయాలంటే జబర్దస్త్ షోలు కావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన ఆరోపణలపై మంత్రి ఆదినారాయణరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రోజా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఒకవైపు సీబీఐని తప్పు పడుతున్న వైసీపీ నేతలు, చంద్రబాబుపై అదే సంస్థతో విచారణ జరపాలంటూ ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. అసలు సీబీఐని మీరు నమ్ముతారా? లేదా? అన్నదానిపై సృష్టత ఇవ్వాలన్నారు. తండ్రి సమానమైన వ్యక్తిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. రాజకీయాల్లో జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు నడవవన్నారు. రోజా రాజకీయాలు వదిలి సినిమాలు, సిరియల్స్కు పరిమితం కావాలని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యాలు మానుకోవాలన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు.













