జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్!
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే ఆ కుటుంబానికి చెందిన పలు బస్సులను సీజ్ చేయగా.. తాజాగా వారి సిమెంటు గనుల లీజును రద్దు చేసింది. అనంతపురం జిల్లా యాడికి మండలంలోని జేసీ కుటుంబానికి సంబంధించిన మైస్సర్స్ త్రిశూల్ సిమెంట్స్‌కు కొనుప్పలపాడులో కేటాయించిన 649.86 హెక్టార్ల సున్నపురాతి గనుల లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ భూములు రాశి సిమెంట్‌కు లీజులో
ఉండేవి. వీటి పదేళ్ల కాలపరిమితి 2004 మార్చి 31కి పూర్తయింది. అప్పటి వైఎస్ ప్రభుత్వం 2005లో ఈ భూములను త్రిశూల్ సిమెంట్స్‌కు జేసీ కుటుంబానికి లీజుకు ఇచ్చింది. అప్పట్లో మూడేళ్లలో ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని సూచించింది. 2010కి లీజు కాలపరిమితి ముగియగా 2015 ఆగస్టు 1 వరకు ఐదేళ్లపాటు ప్రభుత్వం పొడిగించింది. అప్పటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోవడంతో మరో ఐదేళ్లు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అప్పటి ప్రభుత్వం 2020 జూలై 31 వరకు గడువు పొడిగించింది. ఇదే ఉత్తర్వులను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.













