ఆ చట్టం ద్వారా నిందితులను.. శిక్షించే పరిస్థితి లేదు : పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకొచ్చినా ఇప్పటికీ అమలోకి రాలేదని, ఆ చట్టం ద్వారా నిందితులను శిక్షించే పరిస్థితి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అఘాయిత్వానికి ఒడిగట్టింది ఆస్పత్రిలో పని చేస్తున్నవారే కావడం చూస్తుంటే అక్కడి నిఘా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం అవుతోందన్నారు. తమ బిడ్డ కనిపించడం లేదని కన్నవారు పోలీసులను ఆశ్రయించి ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసినా బాధ్యత కలిగిన అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. సత్వరమే స్పందించి ఉంటే ఆమెపై ఘోర అఘాయిత్యం జరిగేదా? అని ప్రశ్నించారు. నిందితులను శిక్షించాలని గొంతెత్తిన జనసేన నాయకులు, ఇతర పార్టీలవారిపై కేసులు నమోదు చేయడంలో చూపించే చురుకుదనం ఒక ఆడబిడ్డ ఆచూకి తెలుసుకోవడంలో చూపించాల్సిందని అన్నారు.
పోలీసులే ఆడ బిడ్డల రక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలి. ఎంతో ఆందోళన, ఆవేదనతో పోలీసులను ఆశ్రయించే తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేలా సత్వర స్పందన అవసరం అన్నారు. రాష్ట్రంలో మహిళలపై ఆఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నాయన వాస్తవం విస్మరించేలేదన్నారు. 2020తో పోలిస్తే 2021లో ఈ కేసులు 25 శాతం పెరిగాయని గతంలో పని చేసిన డీపీజీ స్వయంగా ప్రకటించారు. పాలక పక్షం పోలీసు వ్యవస్థను తమ రాజకీయ అవసరాలు, ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపుల కోసం కాకుండా ప్రజలకు రక్షణ నిమిత్తం వినియోగించాలన్నారు. అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతో పాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా ప్రభుత్వ ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.













