ముగిసిన మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి తండ్రి చితికి నిప్పటించారు. అంత్యక్రియలకు మ్యుమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. దారి పొడవునా పూలు చల్లుతూ గౌతమ్‌రెడ్డికి నివాళులు అర్పించారు.
నెల్లూరులోని మంత్రి నివాసం నుంచి ఉదయగిరి అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ, బుచ్చి సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదు ఉదయగిరి వరకు ఇది కొనసాగింది. మంత్రి గౌతమ్‌రెడ్డిని చివరిసారి చూసేందుకు దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సమయంలో విగతజీవిగా ఉన్న గౌతమ్ రెడ్డిని చూసి ఆయన తల్లి మణిమంజరి తల్లడిల్లిపోయారు. అంతిమ సంస్కారాలు పూర్తయిన తర్వాత సతీమణి శ్రీకీర్తి విలపించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.













