ఏపీకి మరో రెండు భారీ ప్రాజెక్టులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్రో కెమికల్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యక్రమంలో మంత్రి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖ- కాకినాడ పెట్రో కారిడార్‌లో భాగంగా రెండు రిఫైనరీలను నెలకొల్పేందుకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ అంగీకరించినట్లు తెలిపారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా పీయూష్ గోయల్ కలిసినప్పుడు ఏపీలో పెట్రో రిఫైనరీతో పాటు మరిన్ని పెట్టుబడులు వచ్చేల సహకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 8 ఫిషింగ్ హార్బర్లతోపాటు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ల నిర్మాణానికి ఆర్థికసాయం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. బల్ డ్రగ్ పార్కు పోటీలో ఒడిశా కూడా ఉన్నప్పటికీ రాష్ట్రానికే దక్కే అవకాశం ఉందన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ 15 కల్లా రామాయపట్నం, భావనపాడు పోర్టు పనులు ప్రారంభిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలు ఐటీడీసీ, ఎన్డీపీసీ, సెయిల్, బీహెచ్ఈఎల్, కాంకర్లు ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. బీహెచ్ఈఎల్ ఏపీలో సోలార్ పవర్ ప్యానల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసిందన్నారు. దీనికి బీహెచ్ఈఎల్ బోర్డు అనుమతి కావాలి. నాడు నేడు ద్వారా ఆంధప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను ఆధునికరించటాన్ని నీతి ఆయోగ్ సీఈవో అబితాబ్ కాంత్ అభినందించారు. అక్టోబర్‌లో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు నాడు నేడు పనులను స్వయంగా పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రంగాలవారీగా పరిశ్రమలు, ఎగుమతులు, దిగుమతులు, పెట్టుబడులు, మౌలిక వసతులు, సిబ్బంది. వేతనాలు, రీస్కిల్లింగ్, మార్కెటింగ్ వివరాలను సమగ్ర పారిశ్రామిక సర్వే ద్వారా సేకరిస్తామన్నారు.













