ఐదుసార్లు కలిసినా లాభం లేదు… అందుకే బయటికి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకర్గం అట్లూరులో లోకేశ్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఫీుభావం తెలిపారు. ఈ నెల 13న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై లోకేశ్‌తో చర్చించారు. మేకపాటితో పాటు బద్వేల్‌కు చెందిన టీడీపీ నేతలు కూడా లోకేశ్‌ను కలిశారు. అనంతరం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నారా లోకేశ్‌ను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించాం. పాదయాత్ర ఉదయగిరిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఆహ్వానించాలని ఇక్కడి వచ్చాను. నా నియోజకవర్గంలో పాదయాత్రను విజయవంతం చేస్తా. జగన్ మోహన్ రెడ్డిని టికెట్ కోసం ఐదు సార్లు కలిసినా లాభం లేదన్నారు. ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక లాభం లేదనుకొని పార్టీ నుంచి బయటికి వస్తున్నాను. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతాను. నాతో పాటు నెల్లూరు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరతారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తా, ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తా. ఉదయగిరి నియోజకవర్గంలో నేను, వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి లోకేశ్ పాదయాత్రను ఆహ్వానిస్తాం అని పేర్కొన్నారు.













