మామ కోసం అల్లుడు.. పవన్ కోసం పిఠాపురం చేరిన మరో మెగా హీరో..
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించిన తర్వాత పిఠాపురం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల చేదు అనుభవం ఇక్కడ ఎదురు కాకూడదు అని పవన్ చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఇల్లు తీసుకుని అక్కడి నుంచే ప్రచారాలు నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్ముడికి చేదోడు వాదోడుగా ప్రతి పనిలో ముందుండి నడిపిస్తున్నాడు. ఇటీవల బాబాయ్ కి సపోర్ట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు మరొక మెగా హీరో కూడా పవన్ కు మద్దతుగా పిఠాపురం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ మేనల్లుడు వైష్ణవ తేజ్..పిఠాపురం పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మేనమామకు విజయం చేకూర్చాలని ప్రార్థించారు. మరోపక్క మరిది కోసం నాగబాబు అర్ధాంగి కొణిదల పద్మ కూడా ప్రచారంలోకి దిగారు. వైష్ణవ తేజ్..గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లతో కలిసి కొండే వరం నుంచి ఉప్పాడ వరకు జరిగిన రోడ్ షోలో పాల్గొంటున్నారు.













