కుటుంబం అండగా…
పవన్ కల్యాణ్ జనసేన స్థాపించి పదేళ్లు పూర్తయింది. పార్టీని నెమ్మదిగా బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు జనసేనాని. తన ప్రత్యర్థిగా వైసీపీని ఎంచుకున్న పవన్… సీఎం జగన్, వైసీపీ మంత్రుల తీరుపై విరుచుకుపడుతున్నారు. వారాహి యాత్రలతో వైసీపీ వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు. దీంతో వైసీపీ మంత్రులు సైతం… పవన్ పై అంతే ధీటుగా కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది.
అయితే ఈవిషయంలో వైసీపీనేతలు ప్రత్యేక వ్యూహాన్ని అవలంభిస్తున్నారు. పవన్ ను తిడుతూనే.. అన్నయ్య చిరంజీవిని ప్రశంసిస్తున్నారు. పవన్ తీరుతో జనానికి అన్నయ్య చిరంజీవి.. క్షమాపణలు చెప్పాల్సి వస్తోందని మంత్రులతోపాటు పోసాని వంటివారు తెగ ఇదై పోతున్నారు. అంతే కాదు.. పవన్ ను కుటుంబం, ముఖ్యంగా చిరంజీవి కంట్రోల్ చేస్తే బాగుంటుందని సూచిస్తూ వచ్చారు.
చిరంజీవి అందరివాడంటూ.. తమకెంత దగ్గరో చెప్పే ప్రయత్నాలు చేశారు. సినీపరిశ్రమ ఇబ్బందుల్లోపడినప్పుడు చిరంజీవి పెద్దగా బాధ్యత వహించి.. సీఎం జగన్ దగ్గరకురాయభారం నడపడం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అయితే ఆసమయంలో చిరంజీవి చేతులుకట్టుకుని సీఎం జగన్ దగ్గర కనిపించడం, దాన్ని ప్రభుత్వం విడుదల చేయడంపై.. చిరు అబిమానుల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
అయితే ఇటీవలే వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో చిరంజీవి… వైసీపీపై గట్టి పంచేశారు. ప్రతీదానికి పిచ్చుకలాంటి సినీపరిశ్రమపై ఎందుకు పడతారని ప్రశ్నించారు. పేదల కడుపు నింపడంపై ప్రభుత్వం ఫోకస్ ఉండాలని.. అప్పుడే అందరూ చేయెత్తి దణ్ణం పెడతారని, మనసారా ఆశీర్వదిస్తారని సూచించారు. తద్వారా తాను తమ్ముడి పక్షాన ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ఇప్పటికే నాగబాబు, సాయిధరమ్ తేజ్, చరణ్ తేజ్.. బాబాయి వెంటే నడుస్తామని ప్రకటించారు.
ఇంతలో మాజీ భార్య రేణుదేశాయ్ సైతం.. పవన్ కుబాసటగా నిలిచారు. పవన్ కల్యాణ్… తనబిడ్డలకు తండ్రని చెబుతూనే… రాజకీయాల్లోకి కుటుంబసభ్యులు, మహిళలను లాగొద్దని వైసీపీ నేతలకు సూచించారు. ప్రజలకు మేలు చేద్దామన్న మంచిసంకల్పంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. దీంతో ఇన్నాళ్లు ముగ్గురు పెళ్లాలంటూ సెటైర్లు వేసిన వైసీపీనేతలకు గొంతులో వెలక్కాయ పడ్డట్లైంది. ఇక కుటుంబసభ్యుల అండతో పవన్ రాజకీయంగా మరింత విజృంభిస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.













