అమరావతిలో మెడికల్ టూరిజం
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మెడికల్ టూరిజం విస్తరిస్తోంది. విదేశాల నుంచి పలువురు రోగులు శస్త్రచికిత్సల కోసం గుంటూరు వస్తున్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే ఇక్కడ ఉన్నత ప్రమాణాలతో చౌకగా వైద్యసేవలు లభించడమే ఇందుకు కారణం. నైజీరియాకు చెందిన షిగోజిరిమ్ బాంకోల్(7) అనే బాలుడికి రమేశ్ హాస్పిటల్స్‌లో గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. గుండె జఠరికల మధ్య రంధం (ఎఎస్డీ)తో పాటు బృహద్దమని కవాటంతో లీకేజీ ఉండటంతో వాటిని సరిచేసేందుకు శస్త్ర చికిత్స చేశారు. నైజీరియాలో చిన్నపిల్లల గుండె జబ్బులకు తగిన వైద్య సదుపాయాలు లేవు. బాలుడి కుటుంబ సభ్యులు ఇంటర్నెట్లో వెతికి గుంటూరు రమేశ్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించారు. ఈ నెల 6న బాలుడికి చిన్నపిల్లల చీఫ్ హార్ట్సర్జన్ డాక్టర్ బెనెడిక్ట్ రాజ్ నేతృత్వంలో శస్త్రచికిత్స నిర్వహించారు. బాలుడు పూర్తిగా కోలుకున్నట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ పి.రమేష్‌బాబు తెలిపారు. ఇదే శస్త్రచికిత్సకు అమెరికాలో 50-60 వేల డాలర్లు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. తమ హాస్పిటల్లో కేవలం 5వేల డాలర్లకే సర్జరీ చేసినట్లు చెప్పారు.













