ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన ఆలయాలతో పాటు గుర్తించిన మరో 31 ఆలయాల్లో అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించామని, ఆయా ఆలయాల పరిసరాల్లోని భూములు, స్థలాలు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరుస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శాస్త్ర నియమాలు, వాస్తు ఇందులో ప్రధానంగా ఉంటుందన్నారు. దశలవారీగా వీటిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. సమీపంలోని ప్రైవేటు స్థలాల్లో ఆలయాల కార్యక్రమాలకు అంతరాయం కలిగించే కట్టడాలు నిర్మించకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. దీనిపై ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు ఇప్పించనున్నామని చెప్పారు. ప్రైవేటు ఆలయాల్లో నిర్మాణాలు చేపట్టాల్సి వస్తే సంబంధిత ఆలయం అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోసం నివేదిక రూపొందిస్తున్నామని చెప్పారు.
ఆలయాలకు వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు కలిపిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఆలయంలోనూ ఆధ్మాత్మిక శోభ వెల్లువిరిసేలా చూడటమే కాదని, అక్కడికి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే భక్తులకు సౌకర్యాల విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఆలయాల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాలకు సైతం ప్రభుత్వంపై భారం పడకుండా సీసీ కెమెరాలను ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నామన్నారు. చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నప్పుడు దేవుడి పేరిట కొందరు రాజకీయాలు చేస్తున్నారంటూ ఉప ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేసినా వారు విఫలమవుతున్న విషయానిన గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దేవునిపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. దైవకృపతోనే ఈ స్థాయికి వచ్చినట్లు తరచూ సీఎం చెపుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. తామైతే ప్రతి ఒక్కరి మత విశ్వాసాలను కాపాడుతామని చెప్పారు.
విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అర్జునుడు తపస్సు చేసిన కొండకావడం, ఆది శంకరుడు శ్రీచక్ర వేయడం లాంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అరుణాచలం తరహాలో నిత్యం గిరిప్రదిక్షణ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటికే కొత్తగా రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌లో దీనిని కూడా చేర్చామని, ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందించామని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఆలయాల్లో హుండీ నగదు, ఇతర సొమ్ములో అవినీతి జరగదని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. భూముల లీజులు, వేలం నిర్వహణలో అవినీతి జరిగే అవకాశం ఉందన్నారు. వీటికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. విజిలెన్స్‌ను పటిష్టం చేయడంతో పాటు ఆస్తుల లీజులు, భూముల వేలంపై ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. తక్కువకు ఇచ్చినట్టు గుర్తిస్తే తమ ప్రభుత్వ విధానమైన రివర్స టెండరింగ్ తరహా లో రీ ఆక్షన్ నిర్వహిస్తామన్నారు.
దేవాదాయ భూములను
కబ్జా నుంచి విడిపిస్తాం
రాష్ట్రంలో అన్యాక్రాంతమైన దేవదాయశాఖకు చెందిన భూములను తిరిగి రాబట్టే విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. దేవాదాయశాఖకు చెందిన రెండు లక్షల ఎకరాల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనూ, లక్ష ఎకరాల వరకు అర్చకుల ఆక్రమణలోను ఉన్నాయని తెలిపారు. ఆలయ భూములు ఆక్రమణలు గురైన 21 ఆలయాలను గుర్తించగా ఇందులో 18 ఆలయాల పరిధిలో ఆక్రమణలు మరింత ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ఏ విధమైన చర్యలు చేపట్టాలనే దానిపై ఇటీవల అడ్వకేట్ జనరల్‌తో సంప్రదింపులు జరిపామన్నారు. జిల్లా స్టాండిరగ్ కౌన్సిల్ కాకుండా ఎక్కువ ఆక్రమణలు ఉన్న ప్రతి ఆలయానికి ఒక స్టాండిరగ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే మంచిదనే అభిప్రాయం అడ్వకేట్ జనరల్ వ్యక్తం చేశారన్నారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు స్టాండిరగ్ కౌన్సిల్ ఏర్పాటు దోహద పడుతుందన్నారు. ఇదే సమయంలో దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 83.84 అమలుపై దృష్టి సారించామన్నారు.
దేవాదాయ శాఖకు రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయని, వాటిలో 1.05 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు చెప్పారు. ఈ భూములకు సంబంధించి మూడు వేల కేసులు పెండిరగ్లో ఉన్నాయన్నారు. ఆ కేసుల విషయంలో ఆక్రమణదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని కోర్టుల ముందుంచాలన్నారు. భూముల విషయంలో కోర్టు కేసుల ప్రగతి ఎలా ఉందనే విషయంపై ప్రతి మూడు నెలలకోసారి, రాష్ట్రంలో ఆలయాల పరిస్థితిపై ప్రతి శుక్రవారం సమీక్ష నిర్వహిస్తామని మంత్రి వివరించారు. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండే దేవాదాయ శాఖపై లేని పోని అబద్ధాలతో బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కాచుకు కూర్చున్నాయని, ఏ చిన్న పొరపాట్లకూ తావివ్వకుండా బాధ్యతగా పనిచేయాలని ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవిలో భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్లలో నీడ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.













