UK: లండన్ ఆందోళనల వెనక ఏం జరుగుతోంది?

పాశ్చాత్యదేశాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో అక్రమ వలసలపై జనం ఆగ్రహంగా ఉన్నారు. తమ అవకాశాలను వలసదారులు దోచుకోవడంతో పాటు జీవితాల్ని సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఆయా దేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లేటెస్టుగా బ్రిటన్ లో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. బ్రిటన్ లోని కీలక నగరాల్లో వలసలపై ఆగ్రహజ్వాల పెల్లుబుకింది.
పశ్చిమదేశాల్లో ఇటీవలి కాలంలో వలసలపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకొని అక్కడి రాజకీయ పార్టీలు ప్రజలను ఎగదోసి లబ్ధి పొందుతున్నాయి. దీనిని అమెరికా (USA)లోని రిపబ్లికన్ల విషయంలో స్పష్టంగా చూడొచ్చు. ఇటీవల కాలంలో జర్మనీ, ఇంగ్లాండ్(England), ఆస్ట్రేలియా ఇలా కీలక ఐరోపా దేశాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా యూకేలో టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన వలస వ్యతిరేక ఆందోళనలు కొన్ని స్పష్టమైన సంకేతాలు పంపింది. దీనికి ఏకంగా లక్ష మంది హాజరుకావడంతో లండన్ వీధులు జనసంద్రంగా మారాయి.
ఇంగ్లాండ్ (England) సంస్కృతి, గుర్తింపును రక్షించుకోవడం చుట్టూనే ఈ ఆందోళనను సిద్ధం చేశారు. తీరా అదికాస్తా.. వలస వ్యతిరేక నినాదాలు, ప్రసంగాలు, ప్లకార్డులతో నిండిపోయింది. చాలావరకు ఈ ఆందోళన శాంతియుతంగా ముగిసింది. దీనికితోడు ప్రత్యర్థి గ్రూపులు కూడా ఆందోళన చేపట్టడంతో స్వల్ప ఘర్షణలు జరిగాయి. కానీ, రాబిన్సన్ చేపట్టిన ఆందోళన వలసలపై వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఏకమైందో తెలియజేస్తోంది.
ఆందోళనల వెనక ఏముంది..?
ప్రస్తుతం యూకే (UK)లో గృహాలు, వేతనాల కొరత తీవ్రంగా ఉంది. వలసల కారణంగా ప్రజాసేవల రంగాలపై ఒత్తిడి పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వలస విధానాన్ని లక్ష్యంగా చేసుకొన్నారు.
భద్రతాపరమైన కారణాలు కూడా వీటికి తోడయ్యాయి. భారీ నేరాల్లో వలసదారుల పాత్ర ఉంటోంది. కానీ, కావాలని భూతద్దంలో చూపడం.. తప్పుగా చూపిస్తూ రెచ్చగొట్టారు. దీంతో స్థానికుల్లో ఆగ్రహం కూడా రాబిన్సన్ ఉద్యమానికి జనాలను తీసుకొచ్చింది.
రాజకీయ నాయకులు, ఉద్యమకారులు ఉద్దేశపూర్వకంగానే భయాలు పెంచారు. వాటినుంచి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు. సంప్రదాయవాదులైన ఇన్‌ఫ్లూయెన్సర్లు, కామెంటేటర్లు వీలైనంతగా వారి సందేశాలను వ్యాప్తి చేశారు. ఇక ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రచారం దీనికి తోడైంది. వలసపై సంచలన ఆరోపణలను ప్రచారంలోకి తెచ్చారు. ప్రజలు వీధుల్లోకి వచ్చేలా రెచ్చగొట్టారు. రాజకీయ లబ్ధికి.. వీధుల్లో నిరసనలకు వలసలను మించిన అంశం లేదన్న విషయం వారికి బాగా తెలుసు.