Marri Rajasekhar: టీడీపీ గూటికి వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సమక్షంలో తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరనున్నారు. రాజశేఖర్‌తో పాటు చిలకలూరిపేటలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా టీడీపీ గూటికి చేరనున్నారు. ఇ2024 ఎన్నికల్లో వైసీపీ (YCP) ఓడిపోయిన తర్వాత ఐదుగురు ఎమ్మెల్సీలు (MLC) రాజీనామా చేశారు. రాజశేఖర్ రాజీనామా ఇంకా ఆమోదం పొందకపోయినా, ఆయన టీడీపీలో చేరడం వల్ల పల్నాడు జిల్లాలో సమీకరణాలు మార్చే అవకాశం ఉంది.
2004 మర్రి రాజశేఖర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. గుంటూరు (Guntur) జిల్లా చిలకలూరిపేట (Chilakaluripet) అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి పుల్లారావును 212 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ విజయం ఆయన రాజకీయ ప్రారంభానికి మైలురాయిగా నిలిచింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మద్దతుతో ఆయన గెలిచారనే పేరుంది. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజశేఖర్, 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. పార్టీలో సీనియర్ నేతగా మారారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, 2023లో ఎమ్మెల్యేల కోటా ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2029 మార్చి వరకు ఆయన పదవీకాలం ఉంది. అయితే ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.
మర్రి రాజశేఖర్ వైసీపీలో 14 సంవత్సరాలు పనిచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు కావడంతో, ఆయనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ప్రత్యేక గౌరవం లభించింది. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన మనసులో అసంతృప్తి మొదలైంది. 2024 ఎన్నికల సమయంలో చిలకలూరిపేట టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఓడిపోయిన తర్వాత ఇన్ ఛార్జ్ పదవి అయినా ఇస్తారని భావించారు. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విడదల రజనిని తెచ్చి ఇన్‌చార్జ్ ని చేశారు. దీంతో రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు.
2025 ఫిబ్రవరి 12న జగన్ తాడేపల్లిలో ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతల సమావేశానికి మర్రి రాజశేఖర్ హాజరు కాలేదు. అప్పుడే ఆయన పార్టీ మారడం ఖాయమనుకున్నారు. మార్చి 19న ఆయన వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ చైర్మన్ కొయ్యే మొషేన్ రాజుకు సమర్పించారు. “పార్టీ కోసం కష్టపడిన నన్ను గుర్తించలేదు. జగన్ హామీలు ఏమీ నెరవేరలేదు. స్వీయ గౌరవం కోసం రాజీనామా చేస్తున్నాను” అని ఆయన చెప్పారు. అయితే ఆయన రాజీనామాను మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు.
పార్టీకి రాజీనామా తర్వాత మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అప్పడే ఆయన టీడీపీలో చేరతానని ప్రకటించారు. వైసీపీ నాయకత్వం తనను మోసం చేసిందని, 14 ఏళ్లు పనిచేసినా గౌరవం ఇవ్వలేదని ఆక్షేపించారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి జగన్ మోసం చేశారని చెప్పారు. రాజశేఖర్ చేరిక టీడీపీకి పల్నాడు జిల్లాలో బలం పెంచుతుంది. చిలకలూరిపేటలో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మర్రి రాజశేఖర్ దీర్ఘకాలిక ప్రత్యర్థిగా ఉన్నారు. అయితే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు రాజశేఖర్ అత్యంత సన్నిహితుడు. ఆయన స్థానంలో ఖాళీ అయ్యే స్థానం నుంచి మళ్లీ మర్రి రాజశేఖర్ నే మండలికి పంపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.