Marri Rajasekhar Reddy: వైసీపీకి మరో షాక్..! ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా..!!
అధికారం కోల్పోయిన తర్వాత వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) షాక్ లు తగులుతూనే ఉన్నాయి. పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. పార్టీతో పాటు పదవులకు కూడా రాజీనామాలు చేస్తుండడంతో చట్టసభల్లో వైసీపీ బలం కోల్పోతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు రాజ్యసభకు, శాసనమండలికి రాజీనామా చేయడంతో ఆ స్థానాలు అధికారకూటమిపరమయ్యాయి. ఇప్పుడు మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) వైసీపీతో (YCP) పాటు శాసనమండలి (MLC) సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా మర్రి రాజశేఖర్ ఐదో వ్యక్తి.
గుంటూరు జిల్లాలో (Guntur District) వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. జిల్లాలో మంచి పట్టున్న నేతగా మర్రి రాజశేఖర్ కు గుర్తింపు ఉంది. మర్రి రాజశేఖర్ 2004లో తొలిసారి చిలకలూరిపేట అసెంబ్లీ (Chilakaluripet Assembly) నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2010లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జగన్ పాదయాత్రలో (YS Jagan Padayatra) మర్రి రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. 2019లో సీటు ఆశించిన మర్రి రాజశేఖర్ కు నిరాశే ఎదురైంది. అనూహ్యంగా విడదల రజనిని (Vidadala Rajini) బరిలోకి దింపారు జగన్. దీంతో మర్రి రాజశేఖర్ అసంతృప్తితో రగిలిపోయారు. దీంతో మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేయడంతో పాటు మంత్రి పదవికూడా హామీ ఇచ్చారు.
2023లో మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. మర్రి రాజశేఖర్ కు కచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారు. అయితే మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మర్రి రాజశేఖర్ వ్యతిరేకించే విడదల రజనికి కేబినెట్లో స్థానం కల్పించారు. దీంతో మర్రి రాజశేఖర్ అసంతృప్తి తారస్థాయికి చేరింది. విడదల రజనిని 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమకు (Guntur West) పంపించడంతో చిలకలూరిపేట స్థానాన్ని తనకు కేటాయిస్తారని మర్రి రాజశేఖర్ ఆశించారు. అయితే అలా జరగలేదు. విడదల రజని సూచించిన మల్లెల రాజేశ్ (Mallela Rajesh) ను మొదట టికెట్ ఇచ్చారు. తర్వాత ఆయన్ను తప్పించి కావటి మనోహర్ నాయుడిని (Kavati Manohar Naidu) బరిలోకి దింపారు. ఆయన కూడా ఓడిపోయారు. ఆ తర్వాత చిలకలూరిపేట ఇన్ ఛార్జ్ గా మళ్లీ విడదల రజనిని నియమించారు జగన్. దీంతో ఇక తనకు పార్టీలో స్థానం లేదనే నిర్ణయానికి వచ్చారు మర్రి రాజశేఖర్.
విడదల రజనిని తిరిగి చిలకలూరిపేట ఇన్ ఛార్జ్ గా నియమించినప్పటి నుంచే మర్రి రాజశేఖర్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీకి రాజీనామా చేస్తారని అప్పట్లోనే వార్తలొచ్చాయి. ఇవాళ ఆయన పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి, పదవులకు రాజీనామాలు చేశారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ చక్రవర్తి ఇప్పటికే రాజీనామాలు చేయగా శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు (Moshen Raju) వీళ్ల రాజీనామాలను ఆమోదించలేదు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ రాజీనామానైనే ఆమోదిస్తారో లేదో చూడాలి.













