Nara Lokesh: లోకేష్ కు ఆ పదవి ఇవ్వాలి అని డిమాండ్.. మరి జనసేనాని ఏమంటారో?
సంక్రాంతి వేళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు సంబరాల్లో ఉండగా, టీడీపీలో (TDP) కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్‌ను (Nara Lokesh) డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాసేన రాజేష్ (Mahasena Rajesh) ముందుకు తెచ్చారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని, టీడీపీ క్యాడర్ మొత్తం ఇదే కోరుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. మహాసేన రాజేష్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీలో చేరిన రాజేష్, అప్పటినుంచి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. ఇప్పుడు, నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రాజేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.
మహాసేన రాజేష్ అభిప్రాయమేమిటంటే, నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా పార్టీకి ఎంతో ఉపయోగకరంగా పనిచేశారని, కష్టసుఖాలను తట్టుకుని పార్టీకి తన వంతు సేవలందించారని ఆయన ప్రశంసించారు. అత్యుత్తమ విద్యను అభ్యసించిన లోకేష్‌కు రాజకీయాల్లో ఉన్నత స్థానం అందివ్వాలన్నది రాజేష్ అభిప్రాయం. మంత్రిగా ఉన్నప్పటికీ, లోకేష్ ప్రతిభకు తగ్గ ప్రాధాన్యత ప్రభుత్వంలో లేకపోవడం కష్టం కలిగించేదిగా ఉంది అని రాజేష్ అన్నారు.
ముఖ్యంగా సమావేశాల్లో, సభల్లో లోకేష్‌ను వెనుకబడిన స్థితిలో చూడడం బాధ కలిగిస్తుందని, ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తే టీడీపీ క్యాడర్ ఆనందంగా ఉంటుందని రాజేష్ పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని రాజేష్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు లోకేష్‌ను డిప్యూటీ సీఎం హోదాలో చూడాలని ఆశిస్తున్నారని, పార్టీ విజయానికి ఆయన చేసిన కృషికి ఇది గౌరవప్రదమైన గుర్తింపు అవుతుందని రాజేష్ తెలిపారు. 134 ఎమ్మెల్యే సీట్ల విజయానికి లోకేష్ పాదయాత్ర ప్రధాన కారణమని, ఆయన ప్రతిభను గుర్తించి న్యాయం చేయాలన్నారు.
మొత్తానికి, మహాసేన రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసాయి. దీనిపై టీడీపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో, లోకేష్‌కు డిప్యూటీ సీఎం హోదా లభిస్తుందో లేదో వేచి చూడాలి. అయితే వీటన్నిటి మధ్య ఈ ప్రచారం పవన్ జనసైనికులపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో కూడా తెలియాల్సి ఉండి.













