శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదోరోజునై బుధవారం భ్రమరాంబ సమేత మల్లికారుజనస్వామి రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వామికి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి వెంట నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో ఎస్. లవన్న ఉన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో రద్దీ పెరగడంతో భక్తులందరికీ అలంకార దర్శనం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రూ. 500 అతిశీఘ్ర దర్శనం, రూ.200 శ్రీఘ్ర దర్శనం, పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులందరూ క్యాంప్ కోర్టు సెంటర్ వద్ద నుంచి క్యూలైన్లలోకి ప్రవేశించాలి. ఉచిత దర్శనం భక్తులను క్యాంటిన్ పక్కన ఉన్న క్యూలైన్ నుంచి అనుమతిస్తారు.













