కాణిపాకం లో మహాకుంభాభిషేకం మహోత్సవం
ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన ఎన్నారైలు శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఆగస్టు 21వ తేదీన అత్యంత వైభవంగా జరిగింది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ పునర్నిర్మాణానికి అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా ఇచ్చిన రూ.10 కోట్ల విరాళంతో ఈ ఆలయాన్ని శిల్పకళా సౌందర్యంతో పునర్ నిర్మించారు. ఇందులో భాగంగా జరిగిన మహా కుంభాభిషేకం క్రతువును ఆగమ పండితులు వేదోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు చతుర్థకాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన నిర్వహించారు. 8 గంటలకు రాజగోపురం, పశ్చిమ ద్వార గోపురం, విమాన గోపురం, నూతన ధ్వజస్తంభానికి, 8.30 గంటలకు స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయాన్ని పుష్పాలు,విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. కుంభాభిషేకం క్రతువు సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వేలూరు శ్రీపురం స్వర్ణదేవాలయం వ్యవస్థాపకులు శక్తినారాయణి అమ్మవారు ఆవిష్కరించారు.
సుమారు 1100 సంవత్సరాల నుంచి కాణిపాకంలో భక్తులను అనుగ్రహిస్తున్న స్వయంభూ వినాయక స్వామి దేవాలయానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టి లో ఉంచుకొని ఆలయ పునర్ నిర్మాణం అనంతరం జరిగిన ఈ మహా కుంభాభిషేకానికి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నారాయణ స్వామి, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, శ్రీమతి రోజా, పార్ల మెంట్ సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హరి జవహర్ లాల్ లు పాల్గొన్నారు. ఈ నిర్మాణ వ్యయంకి విరాళం ఇచ్చిన దాతలు శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా వారి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహల్ లాల్ మాట్లాడుతూ పాత ఆలయం పూర్తిగా పునర్ నిర్మించామని, మూడంచెలుగా గర్భాలయం, అంతరాలయం, మహా మండపం నిర్మించామని, సుమారు 200 శిల్పులు దాదాపు 13 నెలలు శ్రమించి భారతీయ కళలు ఉట్టిపడేలా నిర్మాణం జరిగిందని తెలిపారు. శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఎంవీ సురేష్ బాబు మాట్లాడుతూ ఈ మహా కుంభాభిషేక వేడుకలకు దాదాపు 50000 కు పైగా భక్తులు వచ్చారని, జిల్లా యంత్రాంగం తో కలిసి పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇంతటి మహత్తర కార్యానికి మేము దాతలుగా వుండే అవకాశం రావటం మా అదృష్టం అని అమెరికా నుంచి వచ్చిన శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా అన్నారు.
మొదటిరోజు నుంచి వివిధ కార్యక్రమాలు.. హోమాలు
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం స్వామివారి దేవస్థానం మహా కుంభాభిషేకంలో భాగంగా ఈరోజు మొదటి రోజు 15.08.2022సాయంత్రం మొదటిగా శివాలయం నుంచి పూజా సామగ్రితో ఆలయంలోకి వచ్చి పూజలు గోపూజ, వేద స్వస్తి, గణపతి పూజ, రక్షాబంధనం,వాస్తు శాంతి, అంకురార్పణ, అఖండ దీపారాధన, పూజలను నిర్వహించడం జరిగింది.
శ్రీ స్వామివారి దేవస్థానం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకంలో భాగంగా తేదీ 16.08.2022 రెండవ రోజు ఉదయం వేద స్వస్తి, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, గణపతి హోమం, చతుర్వేద హవనం, మంత్రపుష్పం, మొదలగు పూజలను నిర్వహించడం జరిగింది, సాయంత్రం చతుర్వేద పారాయణం, కలశధారణ, లఘు పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పము, మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది.
శ్రీ స్వామివారి దేవస్థానం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకంలో భాగంగా తేదీ 17.08.2022 మూడవ రోజు ఉదయం చతుర్వేదపారాయణ, చతుర్వేద హవనం, కలశా ధారణ, నీరాజన మంత్రపుష్పం, మొదలగును పూజ లను నిర్వహించడం జరిగింది, సాయంత్రం విమాన గోపుర నూతన కలశం శివాలయం నుండి మాడా వీధుల్లో ప్రదక్షణ తీసుకొని వచ్చి ప్రధాన ఆలయం యాగశాల పూజల యందు ఉంచడం జరిగింది, తర్వాత యాగశాల నందు పూజలు అనుజ్ఞ, ప్రవేశ బలి, రచ్చోగ్య హోమము, వాస్తు శాంతి, మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది.
శ్రీ స్వామివారి దేవస్థానం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకంలో భాగంగా తేదీ 18.08 2022 నాలుగవ రోజు గ్రామ దేవత పూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం, గోపూజ, స్వర్ణ కలశ ప్రతిష్ట, మొదలగును పూజలను నిర్వహించడం జరిగింది, సాయంత్రం చతుర్వేద పారాయణం, చతుర్వేద హవనం, యాగశాలకి పుట్ట మన్ను తీసుకురావడం జరిగింది, మృత్యంగ్రహణం, అంకురార్పణ, మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది.
శ్రీ స్వామివారి దేవస్థానం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకంలో భాగంగా తేదీ 19.08 2022 ఐదవ రోజు ఉదయం చతుర్వేద పారాయణం, చతుర్వేదహవనం, హస్త్ర హోమం, దిశా హోమం, అగ్ని సంగ్రహణం, మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది, సాయంత్రం సోమకుంభపూజ, కుంభాలంకారం, కళాకర్షణం, మొదలగును పూజలు నిర్వహించడం జరిగింది,
మహా కుంభాభిషేకంలో భాగంగా తేదీ 20.08 2022 ఆరవ రోజు ఉదయం కలశధారణ, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, అష్టబంధన సమర్పణము మొదలగు పూజలు నిర్వహించడం జరిగింది, చతుర్వేద హవన కళసం జలాలలో స్వామి వారి మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించడం జరిగింది. సాయంత్రం తృతీయ కాల పూజ, నాడీసంధానం, స్పర్శహుతి, విశేష ధ్రువ్యాహుతి, మొదలగు పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణధికారి సురేష్ బాబు, ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్, మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, ఈఈ వెంకట నారాయణ, ఏఈఓ లు విద్యాసాగర్ రెడ్డి, కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరి మాధవరెడ్డి, పర్యవేక్షకులు, అర్చకులు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.
మా పూర్వీకు పుణ్యమే : రవి ఐకా
అమెరికాలోని బోస్టన్‌లో ఉంటూ హెల్త్ టెక్నాలజీలో వ్యాపార వ్యవహారాలను నడుపుతున్న రవి ఐకా తెలుగుటైమ్స్‌తో మాట్లాడుతూ శ్రీనివాస్ గుత్తికొండ తాము చిరకాల మిత్రులం, బిజినెస్స్ భాగస్వాములు కూడా అని అంటూ, ఆయనతో కలిసి తరచుగా ఇండియా వెళ్ళడం, వెళ్ళినపుడు తిరుపతి వెళ్ళి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, శ్రీ వేంకటేశ్వరస్వామికి ముడుపులు చెల్లించుకోవడం కూడా అలవాటే అని తెలిపారు. శ్రీనివాస్ గుత్తికొండతో పాటు ప్రతిసారి కాణిపాకం శ్రీ వినాయక స్వామి గుడికి వెళ్ళడం కూడా అలవాటుగా మారిందన్నారు. 2017-18లలో శ్రీ వరసిద్థి వినాయస్వామి గర్భగుడిలో వెండి తాపడం చేయించాలని, సుమారు రూ. 30`35 లక్షల అవుతుందని చెప్పగానే ఆ మొత్తం విరాళంగా ఇవ్వడానికి ఒప్పుకొని చెక్ కూడా ఇచ్చామని.. అయితే ఈ లోపల మొత్తం గుడిని పునర్మించే ఆలోచనలో దేవస్థానం ఉన్నదని తెలిసి.. మొత్తం గుడి పునర్ నిర్మాణానికి దాదాపు మొదట్లో 1 మిలియన్ డాలర్లు (సుమారు 6 కోట్ల రూపాయలు) ఖర్చవుతుందని తెలియగానే శ్రీనివాస్ గుత్తికొండ నేను కలిసి ఇవ్వటానికి ఒప్పుకొన్నా మని తెలిపారు. తరువాత అది పది కోట్ల రూపాయలు వరకు అయిందని తెలిపారు. తమ కుటుంబ పూర్వీకులకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి గుడితో అనుబంధం ఉన్నట్లు తెలుస్తోందని, అందుకే తమకు ఇంతటి మహాకార్యం నిర్వహించే భాగ్యం కలిగిందని అందరూ అంటున్నారని, తాము కూడా నమ్ముతున్నామని తెలిపారు. కేవలం 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద కార్యక్రమం పూర్తి చేశారని, దేవస్థానం అధికారులకు, దేవాదాయ శాఖ అధికారులకు తమ అభినందనలు తెలిపారు.
ఆలయ పునర్నిర్మాణంలో భాగం కావడం మా అదృష్టం: శ్రీనివాస్ గుత్తికొండ
శ్రీనివాస్ గుత్తికొండ అమెరికాలో తెలుగు వారికి చిర పరిచితులు. ప్రముఖ తెలుగు వ్యక్తిగా, తెలుగు కమ్యూనిటీ నాయకుడిగా, జాతీయ తెలుగు సంస్థ చీAుూ చైర్మన్‌గా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కాణిపాకం దేవాలయ పునర్నిమాణ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, తాను చాలా తరచుగా తిరుపతి వస్తూ ఉండేవాడినని, తిరుపతి వచ్చిన ప్పుడు కాణిపాకం కూడా వచ్చే వాడినని, 2010లోనే కాణిపాకంకి 35 లక్షల విరాళం ఇవ్వటం వలన ఆ దేవస్థానంతో అనుబంధం ఏర్పడిరదని తెలిపారు. 2018లో ఆలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిమించే ప్రతిపాదనని దేవాదాయ శాఖ ప్రకటించి, తనను సప్రదించిందని, మిత్రుడు రవి ఐకా కూడా సమ్మతించటంతో 10 కోట్ల రూపాయల విరాళం ఇస్తామని చెప్పటం, దేవస్థానం ఆమోదించడం జరిగాయి అని తెలిపారు. 3 సంవత్సరాలుగా దేవస్థానం అధికారులు ఎప్పటి కప్పుడు ప్రణాళికలు, పని జరిగే తీరు చెప్పే వారని, ఇప్పటి వరకు 750 లక్షల రూపాయిలు ఇచ్చామని తెలిపారు. ఎంతో మహిమ కలిగిన స్వయంభూ స్వామి, కాణిపాక వరసిద్ది వినాయక స్వామి గుడిని పునర్నిమించే అవకాశం రావటం మా అదృష్టంగా భావిస్తున్నాము అని తెలిపారు.
పారదర్శకంగా పనులు జరిగేలా చూశాం
ఆంధ్ర రాష్ట్రంలోని పెద్ద దేవాలయాలలో శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడకి సాధారణ రోజులలో ప్రతి రోజూ 8000`10000 మంది, శని, ఆది వారాలలో 25000-30000 మంది భక్తులు వస్తారని, ఈ భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉందని, గుడి చాలా పురాతనమైనదని, ముఖ్యంగా గర్భగుడి చాలా పాతది అని గుడిని పూర్తిగా పునర్ నిర్మిస్తే బావుంటుందని అనేకసార్లు దేవస్థానం, దేవాదాయ శాఖ భావించిందని, ఆ విధమైన ఆలోచనను ఎన్నారైలు శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకాలతో చెప్పడం వారు విరాళం ఇవ్వటానికి సమ్మతించడం జరిగాయన్నారు. వెంట వెంటనే పూర్తి ప్రణాళిక తయారు చేయడం, విరాళాలు రావడంతో పని మొదలు పెట్టాము. దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు గుడి పునర్మిర్మాణానికి టెండర్ పిలిచి, ఫైనలైజ్ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. దేవాదాయ శాఖ ముఖ్య స్తపతి గారి పర్యవేక్షణలో పనులు జరిగాయి. తమిళనాడు నుంచి శిల్పులు వచ్చారు. తంజావూర్, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన రాళ్ళతో నిర్మాణం జరిగింది. విరా ళాలు ఇచ్చిన దాతలకు కూడా ఎప్పటికప్పుడు ని ర్మాణ విశేషాలను తెలుపుతూ చాలా పారదర్శకంగా నిర్మాణ పనులు జరిగాయి. ఇంత తక్కువ సమయంలో ఆలయ పునర్ నిర్మాణం పూర్తి కావడం ఆ భగవంతుని కరుణవల్లనే అయిందని చెప్పాలి. ఇంతటి మహా కార్యక్రమం నేను ఈవోగా ఉండగా జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానంలో శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
హాజరైన ఎన్నారైలు రవి ఐకా, శ్రీనివాస్ గుత్తికొండ
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం అనంతరం ఆగష్టు 21న మహా కుంభాభిషేకంతో భక్తులకు పునఃదర్శన కలుగజేసే కార్యక్రమంలో భాగంగా ఆగష్టు 4వ తేదీ గురువారంనాడు వేద పండితుల ఆధ్వర్యంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టించారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు వివిధ పూజా పునస్కారాలు వైభవంగా నిర్వహించారు. గణేశుని జయజయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీని వాస్ గుత్తికొండ, రవి ఐకా తోపాటు పండితులు, ప్రభుత్వ అధికారులు, ధర్మ కర్తల మండలి సభ్యులు మరియు భక్తులు విరివిగా పాల్గొన్నారు.













