Mithun Reddy: మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం (AP Liquor Scam) కేసు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (Peddireddy Mithun Reddy) కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయన ఈ కేసులో A4గా ఉన్నారు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) మంగళవారం తిరస్కరించింది. దీంతో ఆయన అరెస్టు అనివార్యంగా మారింది. అదే సమయంలో, విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆయనపై లుక్ అవుట్ నోటీసు (Look out notice) జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మిథున్ రెడ్డి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై అనేక ఆరోపణలున్నాయి. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు సుమారు 3,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం మద్యం విక్రయాల వ్యవస్థను ఆన్‌లైన్ నుంచి మాన్యువల్ పద్ధతికి మార్చినట్లు సిట్ తన వాదనలో పేర్కొంది. ఈ పాలసీలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా కోర్టులో వాదించారు. లంచాలు ఇచ్చిన కంపెనీలకు మాత్రమే లైసెన్సులు జారీ చేశారని, ఇందులో మిథున్ రెడ్డి మాస్టర్‌మైండ్ అని లూథ్రా వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డి తరపున సీనియర్ అడ్వకేట్ టి. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డికి మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేదని, ఆయనను అనవసరంగా నిందితుడిగా చేర్చారని వాదించారు. అయితే, సిట్ తరపు వాదనలు, సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో హైకోర్టు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తీర్పు ఆయన అరెస్టుకు మార్గం సుగమం చేసింది.
బెయిల్ పిటిషన్ తిరస్కరణ తర్వాత, మిథున్ రెడ్డి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన సిట్, మంగళవారమే ఆయనపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నోటీసు ద్వారా ఆయన విమానాశ్రయాలు, ఇతర బయటకు వెళ్లే మార్గాల్లో నిఘా ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, మిథున్ రెడ్డి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో ఆయన ఆచూకీ కోసం సిట్ ఆరా తీస్తోంది. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసు విచారణలో ఇప్పటివరకు 41 మందిని సిట్ విచారించింది. 9 మందిని అరెస్టు చేసింది. మిథున్ రెడ్డి అరెస్టు ఈ కేసులో కీలక మలుపు కానుందని సమాచారం.