ఈసారి జగన్ ని నమ్ముకుంటే రాయలసీమ మరొక రాజస్థాన్ అవుతుంది..లోకేష్
ఈసారి ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న భయం వైసీపీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోందని. అందుకే అందినకాడికి దోచుకునే పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ లో నిర్వహించిన శంఖారావం సభ లో లోకేష్ అధికార పార్టీ పై విరుచుకుపడ్డారు.ఒక్క రాయలసీమ ప్రాంతం నుంచి 53 మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ ఈ ప్రాంతం ప్రజలకు జగన్ చేసింది ఏమీ లేదు అని లోకేష్ అన్నారు. అదే టీడీపీ హయాంలో ఇదే ఉరవకొండలో మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు. నకిలీ ఆధార కార్డులు, పట్టాలు ఉపయోగించి ప్రజల భూములు కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పుణ్యమా అని ఉన్న కాస్త కొండలు, గుట్టలు మాయం అవ్వడం తప్ప ప్రగతి అనే పదం ఎక్కడా కనిపించడం లేదు అని లోకేష్ ఎద్దేవా చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, సైన్స్ సిటీ పేరుతో 17వేల ఎకరాల భూములను తమ ఖాతాలో వేసుకున్న ఈ గవర్నమెంట్ ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చిన దాఖలాలు లేవు అని అన్నారు. 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అనంతపురం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటుందని.. సాగునీరు లేక భూములు బీడులు అయిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి జగన్ వస్తే రాయలసీమ.. రాజస్థాన్ లాగా మారడం ఖచ్చితం అని లోకేష్ అన్నారు.













