దక్షిణాదిలోనూ..మిడతల దండు…యాత్ర…
భారతదేశవ్యాప్తంగా పంటపొలాలపై తమ ప్రతాపం చూపిస్తున్న మిడతల దండు దక్షిణాది రాష్ట్రాల మీదా దండెత్తాయి. రెండు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు జిల్లా లో భారీ సంఖ్యలో మిడతలు రైతుల్ని భయభ్రాంతులకు గురి చేశాయి. దీంతో కుప్పం పరిసరాల్లోని రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు ఈ మిడతల దండు ఆంధ్ర ప్రదేశ్లో కూడా ప్రతాపం చూపిస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇవి ప్రవేశించాయి. ఆది, సోమ వారాల్లో జిల్లాలో ఇవి భయాందోళనలు పెంచాయి. మెలియా పుట్టి మండలం చాపర గ్రామంలోని జిల్లేడు చెట్లపై ఇవి దాడి చేశాయి. దీంతో మిడతల సంచారంపై వ్యవసాయ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఇదిలా ఉంటే తెలంగాణ మీదకూ మిడతల దండు దండెత్తుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో మిడతల దండు ప్రమాదం తమకు లేదని ఇప్పటిదాకా వాటి ఆనవాళ్లేమీ తమ రాష్ట్రంలో లేవని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది.













