Lavu Letter: అమిత్ షాకు టీడీపీ ఎంపీ లావు లేఖ.. ఏమైనా ప్రయోజనం ఉంటుందా..?
తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీ, లోక్ సభలో టీడీపీ పక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Srikrishnadevarayalu) కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు (Amith Shah) వైసీపీ అధినేత జగన్ (YS Jagan) పై లేఖ రాసిశారు. జగన్ అరాచకాలు సృష్టిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నారని, పర్యటనల పేరుతో విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖ రాజకీయ వర్గాల్లో పలు ప్రశ్నలను లేవనెత్తింది. జగన్ తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాగా కేంద్ర మంత్రికి లేఖ రాయడం ఏమిటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ లేఖల వల్ల జగన్పై బీజేపీ చర్యలు తీసుకుంటుందా? అని అడుగుతున్నారు.
లావు శ్రీకృష్ణ దేవరాయలు తన లేఖలో జగన్ను ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ (Professional Political Criminal) గా అభివర్ణించారు. ఆయన పర్యటనలు రాష్ట్రంలో అశాంతిని రెచ్చగొడుతున్నాయని, శాంతి భద్రతలను దెబ్బతీసే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి రాష్ట్రంలో శాంతి భద్రతల బాధ్యత ప్రస్తుత టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (NDA) ప్రభుత్వానిది. మరి ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం ఎందుకు చేసుకుంటారు.. ఆయనకు లేఖ రాయడం వల్ల ఉపయోగం ఏంటి అని చాలా మంది ఆరా తీస్తున్నారు.
జగన్ రాజకీయ చరిత్ర, ఆయనపై ఉన్న కేసులు అమిత్ షాకు తెలియనివి కావు. అక్రమాస్తుల కేసు, మద్యం కుంభకోణం, వివేకా హత్య కేసు వంటి అనేక వివాదాల్లో జగన్ పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ లేఖ (TDP MP Letter) రాయడం కేవలం రాజకీయ ఒత్తిడి తెచ్చేందుకేనని కొందరు భావిస్తున్నారు. అమిత్ షా దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం తక్కువ. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వానిదే అని బీజేపీ (BJP) తప్పించుకునే అవకాశాలే ఎక్కువ. బీజేపీ, వైసీపీ (YCP) మధ్య రహస్య స్నేహం ఉందనే ప్రచారం గత కొంతకాలంగా జోరుగా సాగుతోంది. జగన్పై అనేక కేసులు ఉన్నప్పటికీ కేంద్ర ఏజెన్సీలు గట్టి చర్యలు తీసుకోకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.
టీడీపీ ఈ లేఖల ద్వారా జగన్ను ఢిల్లీ స్థాయిలో ఎండగట్టాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ఇంకా బలమైన పార్టీగా ఉండటం, జగన్ పర్యటనలు ప్రజల్లో ఆదరణ పొందుతుండటం టీడీపీకి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే వ్యూహం టీడీపీ అమలు చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ లేఖల వల్ల ఎంత మేర ప్రయోజనం ఉంటుందనేది చెప్పలేం. జగన్పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదైతే, కేంద్రాన్ని ఆశ్రయించడం వెనుక రాజకీయ వ్యూహం ఉండొచ్చని అర్థమవుతోంది. ఈ లేఖలు రాజకీయ ఒత్తిడి తెచ్చినా, ఆచరణాత్మక చర్యలకు దారితీసే అవకాశం తక్కువే. రాష్ట్ర రాజకీయాల్లో ఈ వివాదం మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.













