Land Pooling: అమరావతి కోసం మళ్లీ భూసేకరణా..? తొందర పడుతున్నారేమో బాబు గారూ..!?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణం కోసం ప్రభుత్వం మరోసారి భూసేకరణకు (Land Pooling) సిద్ధమవుతోంది. కొత్తగా 44 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే 33 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నాయి. రాజధాని నిర్మాణం కనీసం 10 శాతం కూడా పూర్తి కాలేదు. అయినా కొత్తగా మళ్లీ భూమిని సేకరించాలనే నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి నగరాన్ని రూపొందించాలనే లక్ష్యం మంచిదే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారీ భూసేకరణ అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం తొందరపడుతోందని.. ప్రాక్టికల్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
2014లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విభజన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్మించాలని నిర్ణయించినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాల భూమితో రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. అయితే రాజకీయ మార్పులు, ఆర్థిక సంక్షోభం, విధానపరమైన గందరగోళం వంటి కారణాలతో ఈ ప్రాజెక్టు స్తంభించిపోయింది. చంద్రబాబు (Chandrababu) రెండోసారి అధికారంలోకి వచ్చాక.. రాజధాని పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పుడిప్పుడే పనులకు టెండర్లు ఖరారవుతున్నాయి. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇలా చూస్తే రాజధానిలో ఇప్పుడు రోడ్లు, తాత్కాలిక నిర్మాణాలు తప్ప పూర్తిస్థాయి నగరం లేదు. ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన 33 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మరో 44 వేల ఎకరాలు సేకరించడం అనవసర భారాన్ని తెచ్చిపెడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం మంచిదే. సింగపూర్, దుబాయ్ వంటి నగరాలకు సమానంగా ఆధునిక సౌకర్యాలు, పర్యావరణ హిత నిర్మాణాలతో అమరావతిని నిర్మించాలని భావిస్తోంది. ఇది వాస్తవ రూపం దాల్చాలంటే, సమర్థవంతమైన ప్రణాళిక, నిధుల కేటాయింపు, సమయానుగుణమైన అమలు అవసరం. ప్రస్తుతం ఈ మూడు అంశాల్లోనూ అనిశ్చితి కనిపిస్తోంది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న 33 వేల ఎకరాల భూమిలో కీలకమైన మౌలిక సదుపాయాలను నిర్మించడంపై దృష్టి సారిస్తే బాగుంటుందనేది నిపుణుల మాట. రోడ్లు, కార్యాలయ భవనాలు, నీటి సరఫరా వంటి ప్రాథమిక సౌకర్యాలను పూర్తి చేస్తే, రాజధాని నిర్మాణంలో పురోగతి కనిపిస్తుంది. ఇప్పటివరకూ సేకరించిన భూమి ఉపయోగంపై స్పష్టమైన నివేదికను ప్రజల ముందు ఉంచితే వాళ్లలో విశ్వాసం కలుగుతుంది. అప్పుడు భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తారు. రాజధాని అవసరాలను గుర్తిస్తారు. ఎప్పుడో అవసరమయ్యే భూమికోసం ఇప్పుడే సేకరించి వాటికి పరిహారం చెల్లించడం మంచి నిర్ణయం కాదేమోననేది నిపుణులు చెప్తున్న మాట. రాష్ట్ర బడ్జెట్‌పై అదనపు ఒత్తిడి కలిగిస్తుంది.













