Amaravati: అమరావతి కోసం మళ్లీ భూ సేకరణ..! ఈసారి ఎన్ని ఎకరాలో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణం కోసం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వం మరోసారి భూ సేకరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 33 వేల ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ (Land pooling) ద్వారా సేకరించింది ప్రభుత్వం. తాజాగా మరో 44వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి ఈ భూమిని సేకరించాలని నిర్ణయించింది. అయితే, గతంలో ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆరోపించింది. మరి తాజా భూ సేకరణ ఇంకెన్ని వివాదాలకు దారితీస్తుందోనని కొందరు అనుమానిస్తున్నారు.
తుళ్లూరు మండలంలో 24,295 ఎకరాలు, అమరావతి మండలంలో 15,680 ఎకరాలు, మంగళగిరి మండలంలో 4,792.57 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మండలాల్లోని వివిధ గ్రామాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా భూ సేకరణ జరుగుతుంది. తుళ్లూరు మండలంలో వడమాను గ్రామం నుంచి 983 ఎకరాలు, పెదపరిమి నుంచి 784 ఎకరాలు, యాకుతపురం నుంచి 2,360 ఎకరాలు సేకరిస్తారు. అలాగే అమరావతి మండలంలో కర్లపూడి నుంచి 1,199 ఎకరాలు, నిడమర్రుకు నుంచి 949 ఎకరాలు, మంగళగిరి మండలంలో కన్హేరు నుంచి 1,486 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించింది.
అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరంగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు (Chandrababu) లక్ష్యం. ఈ భూమిని ప్రధానంగా రాజధాని నిర్మాణానికి అవసరమైన ఎయిర్ పోర్ట్, రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్.. లాంటి వాటికి వినియోగించే అవకాశం ఉంది. ఇప్పటికే సేకరించిన భూమిలో పరిపాలనా భవనాలు, రోడ్లు, గ్రీన్ జోన్లు, వాణిజ్య ప్రాంతాలు, రెసిడెన్షియల్ జోన్లు, అంతర్జాతీయ విద్యా సంస్థలు, ఆర్థిక కారిడార్లు, పరిశ్రమలు, వినోద ప్రాంతాల నిర్మాణం కోసం ఉపయోగించే అవకాశం ఉంది. అమరావతి నగరాన్ని సింగపూర్ (Singapore) మాదిరిగా అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు ఆలోచన. అమరావతిని స్మార్ట్ సిటీగా (Smart City) మార్చాలని, ఇక్కడ సౌర శక్తి ఆధారిత విద్యుత్ వ్యవస్థలు, నీటి సంరక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే, నదీతీర ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక ఆకర్షణగా మార్చే ప్రణాళికలు కూడా ఉన్నాయి.
అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాలను పరిశీలిస్తే ప్రధానంగా జనాభా, భవిష్యత్ విస్తరణ అవసరాలకు తగ్గట్లు భూమి అవసరం ఉంటుంది. సింగపూర్ నగరం సుమారు 280 చదరపు మైళ్లలో (సుమారు 1,79,200 ఎకరాలు) విస్తరించి ఉంది. అమరావతి వంటి రాజధాని నగరానికి మొదటి దశలో 50వేల నుంచి లక్ష ఎకరాలు సరిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో పరిపాలనా భవనాలు, రెసిడెన్షియల్ జోన్లు, గ్రీన్ స్పేస్‌లు, రవాణా వ్యవస్థలు, వాణిజ్య కేంద్రాలు అన్నింటినీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అమరావతి కోసం ఇప్పటికే 33వేల ఎకరాలు సేకరించారు. తాజా 44వేల ఎకరాలు కలిపితే మొత్తం 77వేల ఎకరాలు అవుతుంది. ఇది అంతర్జాతీయ స్థాయి రాజధాని నగర నిర్మాణానికి సరిపోవచ్చని, భవిష్యత్ విస్తరణకు కూడా అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో అమరావతి కోసం జరిగిన ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలు జరిగాయని, రైతులకు న్యాయం జరగలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాజెక్టును నిలిపివేసి, మూడు రాజధానుల విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అమరావతి నిర్మాణంపై దృష్టి సారించడం, కొత్తగా భూమి సేకరణకు సిద్ధమవడంతో ఈ వ్యవహారం మళ్లీ రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గతంలో రైతులు స్వచ్చంధంగా రాజధానికోసం భూములిచ్చారు. ఇప్పుడు కూడా అలా ముందుకొస్తే ఈ భూసేకరణ పెద్ద కష్టం కాకపోవచ్చు.













