మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి..? మనసు మార్చుకున్నారా..?
లగడపాటి రాజగోపాల్.. పేరు తెలియని వాళ్లుండరు. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందిన ఆయన కచ్చితమైన సర్వేలకు పెట్టింది పేరు. అయితే ఒకసారి తన సర్వే ఫలితాలు రుజువు కాకపోవడంతో ఆయన సర్వేలను విరమించుకున్నారు. అలాగే రాష్ట్రం విడిపోతే తాను పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి సంచలనం రేపారు. అన్నట్టుగానే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ లగడపాటి రాజగోపాల్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన రాజకీయ పునరాగమనానికి సిద్ధమవతున్నారనే ప్రచారం జరుగుతోంది.
లగడపాటి రాజగోపాల్ విజయవాడ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పేరొందారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు. ఆయన కోరిక మేరకే రాజకీయాల్లోకి వచ్చారు లగడపాటి. అనేక మంచి కార్యక్రమాలతో విజయవాడ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న రోజుల్లో ఆయన సమైక్యవాదాన్ని బలంగా వినించారు. పార్లమెంటుతో పాటు బయట కూడా ఆయన బలమైన సమైక్యవాదిగా ముద్ర వేసుకున్నారు. చివరకు పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే రోజు కూడా పెప్పర్ స్ప్రేతో సంచలనం సృష్టించారు. అయినా బిల్ పాసయిపోయింది. రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న మాటకు కట్టుబడి ఆయన దూరమైపోయారు.
అయితే లగడపాటికి ఇప్పటికీ విజయవాడలో మంచి బలగం ఉంది. ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని కోరుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు గతంలో చాలా మంది ప్రయత్నించారు. అయితే వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని.. రాజకీయాలు ముగిసిన అధ్యాయమని లగడపాటి గతంలో చాలా సార్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆయన రాజకీయ ప్రవేశంపై విజయవాడలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఆయన నుంచి అధికారిక ప్రకటనైతే రాలేదు. కానీ ఆయన వస్తే ఆహ్వానించేందుకు పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.
లగడపాటి వస్తే విజయవాడ సీటు ఇచ్చేందుకు టీడీపీ, జనసేన సిద్ధంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఆయన టీడీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. గత ఎన్నికల సమయంలో కేశినేని బదులు వైసీపీ అభ్యర్థి పీవీపీపై లగడపాటి పోటీ చేస్తారని టాక్ నడిచింది. అయితే అది నెరవేరలేదు. ఇప్పుడు కూడా మళ్లీ అటువంటి వార్తలే వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం. అందుకే లగడపాటి తన మనసు మార్చుకునే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. మరి నిజంగా లగడపాటి మనసు మార్చుకుని మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా.. రారా.. అనేది తెలీదు.













