లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా…?
లగడపాటి రాజగోపాల్.. పేరు కొత్త పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందిన ఆయన కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వెలుగొందిన ఆయన.. రాష్ట్రం విడిపోతే రాజకీయాలు వదిలేస్తానన్నారు. ఆ మాటకు కట్టుబడి పాలిటిక్స్ కు పూర్తిగా దూరమై తన వ్యాపారాల్లో బిజీగా గడుపుతున్నారు. అయితే లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు కొంతకాలంగా మళ్లీ వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత..?
లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలంటూ ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. ఆయన అనచురులు కొంతమంది విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. లగడపాటిని మళ్లీ పాలిటిక్స్ లోకి రావాల్సిందిగా ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. ఆయన ఏ పార్టీలో చేరినా తమకు అభ్యంతరం లేదని.. ఆయన వెంటే తాము నడుస్తామని తీర్మానించారు. అంతేకాక.. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని కూడా అనుచరులు నిర్ణయించారు.
లగడపాటి రాజగోపాల్ 2004కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి వరుసగా రెండు సార్లు విజయవాడల నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. సమైక్యవాదిగా పేరొందిన లగడపాటి.. రాష్ట్రవిభజన జరగుకుండా చివరివరకూ పోరాడారు. విభజన బిల్లు ఆమోదం సమయంలో పెప్పర్ స్ప్రే చల్లి సంచలనం సృష్టించారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ముందే చెప్పడంతో.. ఇచ్చిన మాట మేరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. మరోవైపు లగడపాటి సర్వేలు కచ్చితత్వానికి ప్రతీకగా ఉండేవి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ గెలవబోతున్నారని చెప్పారు. కానీ ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి జగన్ ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి లగడపాటి సర్వేలు కూడా చేయకుండా ఉండిపోయారు.
అయితే ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారీ లగడపాటి రాజకీయ పునరాగమనంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన టీడీపీలో చేరుతున్నారని.. విజయవాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని తాజాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్నేహితుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉండడంతో.. ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని కొందరు ఊహించకుంటున్నారు. కానీ లగడపాటి మాత్రం ఇంతవరకూ రాజకీయ పునఃప్రవేశంపై నోరు మెదపలేదు. రెండు నెలల కిందట కూడా ఆయన తనకు రాజకీయాల్లోకి మళ్లీ వచ్చే ఉద్దేశం లేనేలేదని చెప్పారు. కానీ ఇప్పుడు అనుచురులు మళ్లీ హడావుడి చేస్తుండడంతో వస్తారేమో.. వస్తే బాగుంటుందేమో.. అని చాలా మంది కోరుకుంటున్నారు. మరి చూడాలి.. ఏం జరుగుతుందో..!













