కువైట్ నుంచి ఏపీకి విమాన సర్వీసులు
కువైట్ దేశంలో అనధికారికంగా ఉంటున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఆ దేశం నుండి మన రాష్ట్రానికి ప్రత్యేక విమాన సర్వీసులు నడిపేందుకు జజీరా ఏయిర్వేస్ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన, ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం కువైట్ వెళ్లిన ఆయన అక్కడి జజీరా ఏయిర్వేస్ ప్రతినిధులతో పాటు ఆ దేశపు ప్రఖ్యాత కంపెనీలైన గల్ఫ్ స్పిక్స్, మెక్క్, అల్మీర్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయా కంపెనీల్లో ఉన్న ఉద్యోగావకాశాలు, వారికి కావల్సిన నైపుణ్యం తదితర అంశాలపై చర్చించారు. నిరుద్యోగులకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నైపుణ్యం గల కార్మికులను తయారు చేసేందుకు అవసరమైన శిక్షణా తరగతులను నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆయా సంస్థలను మంత్రి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి రవీంద్రతో పాటు ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్, ఏపీఎన్ఆర్టీ అధికారులు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.













