సీఎం చంద్రబాబును కలిసిన బుట్టా రేణుక
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యేందుకు తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నట్లు కర్నూలు పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) బుట్టా రేణుక పేర్కొన్నారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఆమె తన అనుచరులతో కలిసి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసారు. త్వరలో కర్నూలులో పెద్ద బహిరంగసభ ఏర్పాటు చేసి పార్టీలో చేరేందుకు ప్రణాళిక చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ రాజకీయంగా తాను కొత్త అయినప్పటికీ అభివృద్ధిపరంగా ముందుకు వెళ్తున్నానని, దీనిలో భాగంగా రాష్ట్రాభివృద్ధిలో నేను పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో టీడీపీకి మద్దతు తెలుపుతున్నానన్నారు. రాష్ట్రంలో జరిగిన నదుల అనుసంధానాన్ని వేరే రాష్ట్రాల ఎంపీలు మెచ్చుకుంటున్నారని, ఇది నన్ను ఆలోచింపజేసిందన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని, రాష్ట్ర విభజన అనంతరం ఆర్ధిక లోటు ఉన్నా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు.













