ఈగో వదిలి ప్రజల్లోకి వెళ్లండి
అతివిశ్వాసం దరిచేరనీయొద్దు.. సార్ను డిస్టింక్షన్లో పాస్చేయాలి
కుప్పం నేతలకు భువనేశ్వరి నిర్దేశం
2 వేల మంది నాయకులతో టెలీకాన్ఫరెన్స్
కుప్పం, ఏప్రిల్ 2: ‘మేమే గొప్ప అనే ఈగో(అహంభావం) వదలాలి. గ్రామ స్థాయిలో ఉండే చిన్నచిన్న నాయకులు, కార్యకర్తలతో నిరంతరం మాట్లాడుతుండాలి. ప్రజలతో మమేకమవ్వాలి. అతి విశ్వాసం వద్దు.’ అని కుప్పం టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో ఆమె కార్యకర్తలతో మాట్లాడటం ఇది రెండోసారి. మార్చి 27న తొలిసారిగా కుప్పం సమన్వయ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించిన ఆమె.. మంగళవారం 2000 మంది పార్టీ కార్యకర్తలు, చిన్న స్థాయి నేతలతో టెలీకాన్ఫరెన్సు ఏర్పాటుచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న చంద్రబాబు.. సొంత నియోజకవర్గ నేతలతో సమీక్షలు నిర్వహించకపోవడంతో ఆ బాధ్యతను భువనేశ్వరి తీసుకున్నారు. నాయకులు ఈగో పక్కనపెట్టి.. సమన్వయంతో పనిచేసి చంద్రబాబుకు భారీ మెజారిటీ తీసుకురావాలని సూచించారు. ‘2014లో 63 శాతం ఓట్లతో సారు(చంద్రబాబు)ను ఫస్ట్ క్లాసులో పాస్ చేశారు. అయితే ఈసారి 75 శాతం ఓట్లతో డిస్టింక్షన్లో పాస్ చేయించాలి. 1.20 లక్షల ఓట్ల మెజారిటీ సాధించాలి’ అంటూ లక్ష్యం విధించారు.
గ్రామ స్థాయి లీడర్లు, కార్యకర్తలతో నిరంతరం టచ్లో ఉండాలని.. లేనిపక్షంలో ప్రలోభాలకు గురిచేసే అవకాశముందన్నారు. ‘ఆయనేం అక్కడ ఎంజాయ్ చేయడంలేదు. రోజూ విపరీతంగా కష్టపడుతున్నారు. మన పథకాలు కొన్ని పథకాలు గ్రామాల్లోకి వెళ్లడం లేదని తెలిసింది. రాష్ట్రాభివృద్ధితో పాటు మనందరి భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. సంక్షేమ పథకాల గురించి వీలైనంతగా ప్రచారం చేసి మీ వంతు పాత్ర మీరు నిర్వర్తించండి’ అంటూ సూచించారు. ఎన్నికల తర్వాత కూడా కుప్పం నాయకులు, పార్టీ శ్రేణులతో ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు. ‘మనమే మళ్లీ అఽధికారంలోకి వస్తాం. ఆగిపోయిన అభివృద్ధి పనులను దగ్గరుండి చేయించుకుందాం’ అన్నారు. ‘స్టార్’ క్యాంపెయినింగ్ గురించి టెలికాన్ఫరెన్సులో చర్చ జరిగింది.
స్టార్ క్యాంపెయినర్ల అవసరం లేదని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. తనకు కుప్పం ప్రజలపై, నాయకులపై బాగా నమ్మకముందని, ప్రచారానికి వెళ్లకపోయినా గెలిపించే బాధ్యత వాళ్లు తీసుకుంటారని చంద్రబాబు అన్నారని ఆమె తెలిపారు. అత్యధిక మెజారిటీ సాధించి తామేమిటో నిరూపించుకుంటామని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పీఎస్ మునిరత్నం తెలిపారు. కాగా, మండలాల వారీగా పోలింగ్ బూత్ల స్థితిగతులను అంకెలతో సహా వివరించి, హెచ్చరికలు జారీ చేయడంతో నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సమావేశం అటు నాయకుల్లో, ఇటు కిందిస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.













