ప్రధాని మోదీతో ఎంపీ ఆర్ కృష్ణయ్య భేటీ
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దేశవ్యాప్తంగా ఉన్న బీసీల డిమాండ్లపై చర్చించి వినతిపత్రం అందజేశారు. అనంతరం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, త్వరలో చేపట్టబోయే జన గణనగణనలో బీసీల కులగణన చేపట్టాలని కోరినట్లు తెలిపారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కులవృత్తులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రధానిని కోరామన్నారు. 75 ఏళ్లుగా దేశంలోని 56 శాతం గల బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ రంగాల్లో సమాన వాటా ఇవ్వకుండా అన్ని రాజకీయపార్టీలు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ప్రధానమంత్రి హోదాలో మోదీ జోక్యం చేసుకుని దేశంలోని బీసీలందరికీ న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. బీసీల డిమాండ్లు న్యాయమైనవని దశలవారీగా పరిష్కరిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య పేర్కొన్నారు.













