నవ్యాంధ్రలో కొరియన్ టూరిజం
గుంటూరులో కొరియన్ టూరిజం సంస్థ (కెటిఓ) శాఖను ప్రారంభించనున్నట్లు ఆ దేశ కాన్సులేట్ జనరల్ హుంగ్ తాయ్ కిమ్ చెప్పారు. ఇప్పటికే తమ టూరిజం సంస్థ ఢిల్లీలో ఉందని, తొందరలోనే నవ్యాంధ్ర రాజధానిలో కూడా ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కొరియా కాన్సులేట్ బృందం సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియను మర్యాదపూర్వకంగా కలిసింది. హుంగ్ తాయ్తో పాటు కొరియన్ డిప్యూటీ కాన్సులేట్ చుంగ్ దాయ్ తన భార్యతో కలిసి మంత్రిని కలిశారు. కొరియన్ బృందానికి మంత్రి స్వాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హుంగ్ తాయ్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తోందని కొరియన్ కాన్సులేట్ జనరల్ హుంగ్ తాయ్ కిమ్ అన్నారు. కొరియా దేశానికి ఆంధ్రప్రదేశ్తో అనాదిగా అవినాభావ సంబంధాలున్నందున కొరియన్ పర్యాటక బృందాలు తొందరలోనే ఆంధ్రాకు వెల్లువెత్తుతాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొరియన్ దేశస్తులు ఎక్కువగా చైనాకు వెళుతుంటారని చెపుతూ వీరి దిశ ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ వైపు మారుతుందని తెలిపారు. తమ దేశ జనాభాలో పదోవంతు కొరియన్లు బౌద్ధ మతస్థులని చెప్పారు. వారంతా రాజధాని అమరావతి సందర్శనకు ఆసక్తిగా ఉన్నారని అన్నారు.













