Kondapalli Srinivas: మాయ మాటలు చెప్పలేదు, చెప్పాం చేసి చూపించాం

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ (pension) ల విషయంలో శాసన మండలిలో సంబంధిత శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నోత్తరాల సమయంలో క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు రమేష్, భరత్ అడిగిన ప్రశ్నలపై సమాధానం ఇచ్చారు కొండపల్లి శ్రీనివాస్. 50-59 వయసు మధ్య ఉన్నవారు 11,98,501 మంది పింఛన్ పొందుతున్నారని స్పష్టం చేసారు. ప్రతి నెలా ఒకటో తేదీన పేదలకు పింఛన్లు ఇస్తున్నామని, ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ ల పండుగ జరుగుతోంది అన్నారు. వృద్ధులకు ఇచ్చే పింఛన్లను 3 వేల నుంచి 4 వేలకు ఒకేసారి పెంచామని వివరించారు.
అర్హులకు ఎక్కడా పింఛన్లు తొలగించలేదని, వెరిఫికేషన్ లో అనర్హులకు కొందరికి పెన్షన్ లను తొలగించినట్టు తెలిపారు. భర్త చనిపోయిన మహిళలకు స్పౌజ్ పెన్షన్లు(Spouse pension) ఇస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో మాదిరిగా పెన్షన్ ల విషయంలో 5 ఏళ్ళ సమయం తీసుకోలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ లను పెంచి ఇచ్చామన్నారు. పెంచుకుంటూ పోతామని మభ్యపెట్టడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పెన్షన్ లు మూడు నెలలవి కలిపి ఇచ్చినట్టు మండలిలో మంత్రి స్పష్టం చేసారు. గత ప్రభుత్వములో ఎవరైనా పెన్షన్ దారుడు అత్యవసర పరిస్థితులలో, పంపిణీ సమయంలో తన ఊరి నుంచి బయటకు వెళ్తే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిన పరిస్థితి ఉండేది కాదు.
పెన్షన్ కోసం కష్టపడి పరుగులు తీసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని మంత్రి గుర్తు చేసారు. ఎన్డియే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారిందని, మూడు నెలల పాటు సమయం ఇస్తున్నామన్నారు కొండపల్లి శ్రీనివాస్. మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే విధంగా అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఈ విధంగా మార్పులు చేయడంతో ఇప్పటి వరకు 8,63,216 పెన్షన్ లబ్దిదారులకు 731.17 కోట్ల రూపాయలను చెల్లించినట్టు మంత్రి వివరించారు. నవంబర్ 2024 నుండి ప్రతినెలా స్పౌజ్ పెన్షన్స్ మంజూరు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో పెన్షన్ రాని లబ్దిదారులకు సైతం ఈ ప్రభుత్వంలో ఇస్తున్నట్టు స్పష్టం చేసారు.