ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే.. అది వైఎస్ఆర్ వల్లే
ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది వైఎస్ఆర్ వల్లే అని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. కొండా సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడకు వచ్చిన సురేఖ పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంరద్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులను ఎప్పుడూ కలవలేదని తెలిపారు. తనకు వైఎస్ఆర్తో మాత్రమే అనుబంధం ఉండేదని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూనే రాజకీయాల్లో కొనసాగుతున్నామన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఎలాంటి విలువలు లేవు. డబ్బే ప్రాధాన్యతగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ అయినా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేయాలి. ఇక్కడ వేరే ప్రభుత్వం ఉంది. నా కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా. తెలంగాణ ఎందుకు వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటోందని విమర్శించారు.













