తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైభవంగా నిర్వహించింది. ఈ నెల 25న వైకుంఠ ఏకాదశి పుస్కరించుకొని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టును అర్చకులు పట్టు వస్త్రంతో కప్పివేశారు. నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి. కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణగా వెళ్లి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆనందనిలయం, బంగారువాకిలితో పాటు శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం పూజా సామగ్రి తదితర వస్తువులను శుభ్రపరిచారు. స్వామివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.













