ఏపీలో సంచలనం సృష్టించిన కేసు.. బెయిల్ కోసం సీబీఐకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సుమారు నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం, ఎన్ఐఏ ఎలాంటి విచారణ జరపడం లేదని లేఖలో సావిత్రి పేర్కొన్నారు. 2018లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర అనంతరం జగన్ హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఓ యువకుడు ఒక్కసారిగా కోడి పందేళ్లలో వాడే కత్తితో జగన్‌పై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన అప్పట్లో రాజకీయ ప్రకంపనలు రేపింది. బాబు పాలనలో తనకు రక్షణ లేదని జగన్ ఆరోపించారు. రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదనడంతో కేసు విచారణకు ఎన్ఐఏకు అప్పగించారు.













