30న కోడెల విగ్రహం ఆవిష్కరణ
నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఈ నెల 30న నరసరావుపేటలో ఆవిష్కరిస్తున్నారు. డాక్టర్ కోడెల విగ్రహాన్ని పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని సత్తా రామేశ్వరంలో ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్ తయారు చేశారు. డాక్టర్ కోడెల సంస్మరణ కార్యక్రమాన్ని ఈ నెల 30న నరసరావుపేటలో కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడెల విగ్రహాన్ని ఆవిష్కరించి సంతాప సభ నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. సంతాప సభకు వివిధ పార్టీల నేతలను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నరసరావుపేటలో విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదని టీడీపీ వర్గాలు తెలిపాయి.













