Kodali Nani: వంశీ కేసులో నానీ బుక్ అవుతారా…?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) వ్యవహారంలో ఇప్పుడు పోలీసులు కొన్ని అంశాలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో జరిగిన కబ్జాల వ్యవహారాలకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గన్నవరంతో పాటుగా విజయవాడ నగరంలో కూడా కొన్ని స్థలాలను బలవంతంగా వంశీ రాయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయవాడ రూరల్ మండలంలోని వంశీ దాదాపుగా ఆరు ఎకరాలను అక్రమంగా రాయించుకున్నారు అనే వార్తలొస్తున్నాయి.
అలాగే మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) సహకారంతో గుడివాడలో కూడా వంశీ గ్యాంగ్ అక్రమాలకు పాల్పడిందని, కబ్జాలకు దిగారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందాయని, ఆ నివేదికలను పోలీసులకు కూడా ఇచ్చారని.. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇక వంశీ వ్యవహారాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్ గానే తీసుకున్నారు. వైసిపి హయాంలో రెచ్చిపోయిన వంశీ.. ఏది పడితే అది మాట్లాడారు.
అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వంశీ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. తాజాగా ఆయనపై గన్నవరంలో మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. సోమవారం ఒక కేసు నమోదు కాగా మంగళవారం మరో కేసు, బుధవారం రెండు కేసులు నమోదయ్యాయి. ఇక గురువారం కూడా ఆయనపై హనుమాన్ జంక్షన్ మండలంలో జరిగిన కొన్ని అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు కొంతమంది సిద్దమయ్యారు. దీనితో వంశీని ఇప్పట్లో విడుదల చేయడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటు వంశి అనుచరుల కోసం కూడా పోలీసులు గట్టిగానే గాలిస్తున్నారు. ఇప్పటికే నలుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, త్వరలోనే మరి కొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉంది.













