Kodali Nani : కొడాలి నాని వైసీపీని వీడినట్లేనా..?
కొడాలి నాని (Kodali Nani) పేరు తెలియని తెలుగువారుండరు. ఆయనంత పాపులర్. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న నాని.. ఆ తర్వాత వైసీపీలో తన హవా కొనసాగించారు. చంద్రబాబు, లోకేశ్ పై బూతులతో విరుచుకు పడడంలో ముందుండేవారు కొడాలి నాని. జగన్ పై పల్లెత్తు మాట కూడా పడకుండా అడ్డంగా నిలబడిపోయేవారు. అసెంబ్లీలో కానీ, బయట కానీ చంద్రబాబు అండ్ కోను విమర్శించాలంటే వైసీపీ ప్రయోగించే మొదటి అస్త్రం నాని. కానీ వైసీపీ ఓడిపోయిన తర్వాత కొడాలి నాని పూర్తిగా కనుమరుగైపోయారు. జిల్లాలో, రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నా నాని మాత్రం నోరు తెరవట్లేదు.. కనిపించట్లేదు.
గుడివాడ నుంచి నాలుగు సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు కొడాలి నాని. రెండు సార్లు టీడీపీ, రెండు సార్లు వైసీపీ నుంచి ఆయన విజయం సాధించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, నోటికి పని చెప్పగల తెంపరితనం ఉండడంతో అధికారంలోకి రాగానే కొడాలి నానికి జగన్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో నానికి మరింత పాపులారిటీ వచ్చింది. టీడీపీపై విరుచుకుపడేందుకు లైసెన్స్ వచ్చిందనే చెప్పాలి. అందుకే జగన్ ఏం చెప్తే దానికి సై అనే వారు. మూడు రాజధానుల విషయంలో సొంత జిల్లా అయి ఉండీ జగన్ కు మద్దతుగా నిలిచారు. ఇది అప్పట్లో విమర్శలు వచ్చినా కొడాలి నాని ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.
అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. కొడాలి నాని కూడా గుడివాడలో పరాజయం చవిచూశారు. అప్పటి నుంచి ఆయన గుడివాడలో అడుగు పెట్టడం మానేశారు. ఈ ఆరు నెలల్లో రెండు మూడు సార్లు మాత్రమే నాని గుడివాడ వచ్చారు. అప్పుడు కూడా కార్యకర్తలను కలవలేదు. కార్యకర్తలు కూడా ఆయనకు ఫోన్లు చేసి చేసి అలసిపోయారు. వాళ్ల పనులు వాళ్లు చూసుకుంటున్నారు. నాని ఎక్కువగా హైదరాబాద్ లోనే గడుపుతున్నారు. ఆ మధ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఆయన గుడివాడ రావడం మానేశారు. దీంతో కొడాలి నాని ఇక యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోవచ్చనే టాక్ ఆయన సన్నిహితుల్లో వినిపిస్తోంది.
మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో కూడా కొడాలి నాని పాల్గొనట్లేదు. జగన్ తాడేపల్లిలో అందుబాటులో ఉన్న రోజుల్లో పార్టీ కార్యాలయం నుంచి కొడాలి నానికి ఫోన్లు వెళ్తున్నాయి. అయితే తాను అందుబాటులో లేనని.. తర్వాత కలుస్తానని చెప్తూ నాని తప్పించుకుంటున్నట్టు సమాచారం. ఓడిపోయిన తర్వాత ఒక్కసారి తప్ప మరెప్పుడూ తాడేపల్లి గడప నాని తొక్కలేదు. జిల్లా పార్టీ నేతల సమావేశానికి కూడా నాని హాజరు కాలేదు. బుడమేరు వరదల సమయంలో కూడా నాని కనిపించలేదు. ఇప్పుడు జగన్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేర్ని నాని వాటిని ఖండించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ కొడాలి నాని మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. దీంతో కొడాలి నానిపై ఇక ఆశలు వదులుకోవడమే బెటర్ ఆలోచనకు పార్టీ హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. నాని కూడా ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటేనే బెటర్ డిసైడైనట్లు సమాచారం. టీడీపీపై తాను గతంలో చేసిన కామెంట్స్ ఎక్కడ తన మెడకు చుట్టుకుంటాయోననే భయం కూడా నానిని వెంటాడుతున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.













