Kodali Nani : రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై..!?
కొడాలి వెంకటేశ్వర రావు పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. కొడాలి నాని అంటే మాత్రం తెలుగు వాళ్లెవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. రాజకీయాల్లో కొడాలి నాని ఒక ఫైర్ బ్రాండ్. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న నాని.. ఆ తర్వాత ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీలో ఉంటూ టీడీపీ నేతలకు ముచ్చెమటలు పట్టించారు. గుడివాడను తన అడ్డాగా మార్చుకుని చక్రం తిప్పారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు కొడాలి నాని టైం అస్సలు బాగాలేదు. అందుకే ఓడిపోయారు. ఏకంగా ఇప్పుడు రాజకీయాలకే గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఎన్టీఆర్ ను అమితంగా ఆరాధించే కొడాలి నాని.. హరికృష్ణకు ముఖ్య అనుచరుడిగా పేరొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో కొడాలి నానికి పొసగలేదు. దీంతో ఆయన్ను విభేదించి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి టీడీపీ నేతలపైన, ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్ పైన ఓ రేంజ్ లో బూతులు తిడుతూ విరుచుకుపడ్డారు. జగన్ కూడా చంద్రబాబు, లోకేశ్ ను తిట్టేందుకు కొడాలి నానిని ఒక ఆయుధంలా వాడుకున్నారు. బూతులతోనే కొడాలి నాని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు.
వరుసగా మూడుసార్లు గెలిచిన కొడాలి నాని ఇటీవలి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. గుడివాడలో ఇన్నాళ్లూ తనకు తిరుగులేదనుకున్న నాని.. ఈ ఎన్నికల్లో దాదాపు 50వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి నాని సైలెంట్ అయిపోయారు. నానిపై కేసులు వేలాడుతున్నాయి. నాడు నోరుజారిన నేతలందరిపైనా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. త్వరలో కొడాలి నానిపైన కూడా కేసులు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో కొడాలి నాని వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా బయటకు వస్తున్నా ఇంతకుముందు లాగా నోటికి పని చెప్పట్లేదు. గౌరవంగా మాట్లాడుతున్నారు.
కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ ఈసారి వ్యూహాత్మకంగా పనిచేసి సక్సెస్ అయింది. ఇకపై ఎట్టిపరిస్థితుల్లో కొడాలి నాని గెలవకూడదనే టార్గెట్ తో పనిచేస్తోంది. నాని కేడర్ కూడా పూర్తిగా ఆయనకు దూరమైంది. నాని వెంట ఉంటే కేసుల్లో ఇరుక్కుపోతామనే భయమే ఇందుకు కారణం. దీంతో నాని కూడా కేడర్ ను పట్టించుకోవట్లేదు. నాని కూడా గుడివాడలో ఎక్కువగా ఉండట్లేదు. హైదరాబాద్ లో ఉంటూ అడపాదడపా మాత్రమే గుడివాడ వస్తున్నారు. ఇంటిపనులు చూసుకుని వెళ్లిపోతున్నారు. పైగా ఆరోగ్యం కూడా ఈ మధ్య సరిగా ఉండట్లేదని సమాచారం. అందుకే ఇక రాజకీయాలకు దూరంగా ఉండడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జగన్ కు చెప్పారట. త్వరలోనే గుడివాడకు కొత్త నాయకుడిని చూసుకోవాలని సూచించారట.













